హైదరాబాద్:తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల.. ఆ దిశగా తన అడుగులు వేస్తూనే ఉన్నారు. అటు సన్నిహితులతోనూ, ఇటు తెలంగాణ సమస్యలపైన, పాలనపైన అవగాహన ఉన్న వ్యక్తులతోనూ సమావేశమై చర్చలు జరుపుతున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సీఎంవోలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ప్రభాకర్‌రెడ్డి, సీఎ్‌సవోగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ఉదయ్‌కుమార్‌తో బుధవారం లోట్‌సపాండ్‌లో షర్మిల భేటీ అయ్యారు. వైఎస్ హయాంలో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్న ఆమె.. తాను పెట్టబోయే పార్టీ విషయంలో సహాయసహకారాలను అందించాలని కోరారు. పలు కుల సంఘాల నేతలు, వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన వైఎస్ అభిమానులనూ ఆమె కలిశారు. నల్లగొండ నేతలతో ఆత్మీయ సమవేశం నిర్వహించినప్పటి నుంచి నేతల రాకతో లోట్‌సపాండ్ కళకళలాడుతూనే ఉంది. ఇక తెలంగాణ పోరాట యోధు ల చరిత్రనూ షర్మిల బృందం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. భీం రెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం వంటి పలువురు తెలంగాణ కమ్యూనిస్టు యోధులకు తగిన గుర్తింపు లేదని, నల్లగొండ జిల్లాలో ఏదైనా జాతీయ రహదారి, ప్రాజెక్టు.. మరో కట్టడానికో వారి పేర్లు పెట్టేలా భవిష్యత్తులో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే తెలంగాణలో మరుగున పడ్డ యోధుల చరిత్రను వెలికితీసే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
