వ్యాక్సిన్‌కు వెనుకడుగు

0
192
Spread the love

రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కరోనా టీకా పంపిణీ శనివారం ప్రారంభమైంది.

530 కేంద్రాల్లో పోలీసు, మునిసిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బంది 41,666 మందికి టీకా వేయాలని నిర్దేశించుకోగా.. 15,437 మందే ముందుకొచ్చారు. దీంతో లక్ష్యంలో 37 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నట్లైంది. వీరిలో ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు మీడియా బులెటిన్‌లో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,08,922 మందికి టీకా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, వ్యాక్సిన్‌ నూటికి నూరు శాతం సురక్షితమని.. ఎలాంటి అపోహలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.

హైదరాబాద్‌ తిలక్‌నర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీనియర్‌ పోలీస్‌ అధికారి నుంచి సిబ్బంది వరకు అందరూ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారని పేర్కొన్నారు. తమ సిబ్బందికి నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారని.. అవసరమైతే దీనిని పొడిగించాలని కోరతామని చెప్పారు. సామాన్య ప్రజల్లో నెలకొన్న అనుమానాలను పోలీస్‌ సిబ్బంది తొలగించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో ఉత్తమ సేవలు అందించారని అభినందించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వైద్యాధికారులు, సిబ్బందిని డీజీపీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకట్‌ పాల్గొన్నారు.

రాష్ట్రంలో మరో 161 మందికి పాజిటివ్‌

రాష్ట్రంలో శుక్రవారం 161 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో ఒకరు చనిపోయారు. మొత్తం కేసులు 2,95,431కు, మరణాలు 1,608కు పెరిగాయి. కొత్తగా 147 మంది డిశ్చార్జితో కోలుకున్నవారి సంఖ్య 2,91,846కు చేరింది. 1,977 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 28, మేడ్చల్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి జిల్లాల్లో పది చొప్పున నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో ఒక్క కేసూ రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here