రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించబోతున్న వైఎస్ షర్మిలకు మద్దతు ఇచ్చి, వైఎ్‌సఆర్ బిడ్డగా ఆమెను ఆదరిద్దామని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు వైసీపీ నాయకులు, వైఎస్ అభిమానులు నిర్ణయించారు. ఈనెల 21న షర్మిల ఖమ్మం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆమె పర్యటనను విజయవంతం చేసేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు శుక్రవారం ఖమ్మంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, హాజరయ్యారు. అయితే ఎక్కడా వైసీపీ ప్రస్తావన లేకుండా.. వైఎస్ రాజశేఖరరెడ్డి, షర్మిల ఫొటోలతో మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం షర్మిల పార్టీ వ్యవహారాలను చూస్తున్న లక్కినేని సుధీర్ మాట్లాడుతూ.. షర్మిల ఆధ్వర్యంలో తెలంగాణలో కొత్త పార్టీ రాబోతున్నందున ఆమె సారథ్యంలో కార్యకర్తలు, నాయకులకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు.

షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొల్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో జగన్ సీఎం అయ్యారని, తెలంగాణలోనూ షర్మిల ముఖ్యమంతిర కావాలని ఆకాంక్షించారు. తుమ్మ అప్పిరెడ్డి, సామినేని రవి, రాంబాబురెడ్డి, ఆలస్యం సుధాకర్, పలువురు ముఖ్యనాయకులు మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్ పట్ల అభిమానం చెక్కుచెదరలేదని, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు పదవులు లేకపోయనా పార్టీని నమ్ముకుని పని చేస్తున్నామని, షర్మిల రాకతో వైసీపీ తెలంగాణ పార్టీగా దూసుకుపోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.