.హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వె్‌స్టమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును తీసుకురాలేని బీజేపీ.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే ఐటీఐఆర్‌కు సమానమైన మరో ప్రాజెక్టును హైదరాబాద్‌కు తేగలరా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ గురించి మంగళవారం బండి సంజయ్ రాసిన లేఖ ఓ అబద్ధాల జాతరంటూ బుధవారం ఓ ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా మూలన పెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాదే ఈ మేరకు విస్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ఈ ప్రకటన గురించీ సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. అసత్యాలు, అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం.. బండి సంజయ్ లేఖ ద్వారా మరోమారు బయటపడిందన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి.. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రానికి ఆయన లేఖ రాయాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి అబద్ధాలనైనా మాట్లాడే నైజం బీజేపీదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి నెలలోనే (జూన్, 2014) ఐటీఐఆర్‌పై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని, మళ్లీ సెప్టెంబరు, 2014లో పూర్తి వివరాలతో కేంద్రానికి ఒక మెమోరాండంనూ సమర్పించామని వివరించారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినతిపత్రాలను ప్రధానికి, కేంద్ర ఐటీ శాఖ మంత్రికి తానే స్వయంగా అందించానని పేర్కొన్నారు. అయినా కేంద్రం స్పందించలేదన్నారు.

లక్ష్యాన్ని అధిగమించడం గర్వంగా ఉంది
సంప్రదాయేతర ఇంధన వనరుల (రెనెవెబుల్ ఎనర్జీ) ఉత్పత్తి రంగంలో తెలంగాణ రాష్ట్రం లక్ష్యాన్ని మించి ఫలితాన్ని సాధించినందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక రాష్ట్రం సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి రంగంలో లక్ష్యాన్ని మించి ఉత్పాదన సామర్థ్యాన్ని సాధించినట్టుగా మింట్ ప్రకటించింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో సీఎం కేసీఆర్ విజన్, చిత్తశుద్ధి ప్రశంసనీయమని మరోసారి రుజువైందని కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
రాష్ట్రంపై అభాండాలా?
ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేయాల్సి ఉండగా.. ఆ ప్రాజెక్టు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమనడం విడ్డూరమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలగాణలోనే కాకుండా.. ఐటీఐఆర్ మంజూరైన ఏపీ, కర్ణాటక, ఒడిసా రాష్ట్రాల్లోనూ.. పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, ఈ సంగతీ సంజయ్‌కు తెలియకపోవడం ఆయన అజ్ఞానాన్ని సూచిస్తోందన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు పనులు మొదలు కాకపోవడానికి కారణం కూడా సీఎం కేసీఆరేనా? అంటూ ప్రశ్నించారు. వాస్తవాలను దాచిపెట్టి.. రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేయడానికి సిగ్గనిపించట్లేదా? అని ధ్వజమెత్తారు. ఏడేళ్లలో ఎన్నోసార్లు ఐటీఐఆర్‌కు సంబంధించిన డీపీఆర్‌లు, మెమోరాండంలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రాసిన లేఖల ను, డీపీఆర్‌లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, సంజయ్‌కు దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి ఐటీఐఆర్‌ను లేదా ఆ ప్రాజెక్టుతో సమానమైన ఇతర ప్రాజెక్టును తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.