
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స అందించి, ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటోంది. వైరస్ నియంత్రణలో గత ఏడాది చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడూ.. అదే పద్ధతి అవలంబించడానికి సమాయత్తమైంది. పాజిటివ్‌లు అందరికీ ఒకేచోట కాకుండా, తీవ్రతను బట్టి వేర్వేరుచోట్ల చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో సీరియస్ రోగులను మాత్రమే చేర్చుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వైరస్ సోకినవారిని అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు లేనివారిని చేర్చుకోవద్దని నిర్ణయించారు. మరోవైపు ఆస్పత్రిలో కరోనా ఓపీ, శాంపిళ్ల సేకరణ చేపట్టారు.
గాంధీలో ప్రస్తుతం కొవిడ్, నాన్ కొవిడ్ కేసులకు వేర్వేరుగా చికిత్సలు అందిస్తున్నారు. వైరస్ బాధితులకు 200 ఐసీయూ పడకలుండగా.. కొత్తగా 100 ఏర్పాటు చేయనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు. మరోవైపు ఈ నెల మొదటి వారంలో గాంధీలో 50లోపు కేసులుండగా ప్రస్తుతం 120కి పెరిగారు. పాజిటివ్‌లలో మైల్డ్, మోడరేట్ కేసులను కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రి, గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఊపిరితిత్తులు, ఇతర శ్వాసకోశ సంబంధిత కేసులను ఛాతీ ఆస్పత్రికి పంపనున్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో మంగళవారం నాటికి 126 మంది వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు.