హోంమంత్రి బంధువుల భూదందా!

0
290
Spread the love

హోంమంత్రి మహబూబ్‌ అలీ బంధువులు కొందరు.. ఆయన పేరు చెప్పుకొని జోరుగా భూదందా సాగిస్తున్నారు. సెటిల్మెంట్ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ‘‘మై కౌన్‌ హూ మాలూమ్‌..! మేరే పీచే కౌన్‌ హై మాలూమ్‌..!!’’ అంటూ బెదిరింపులకు దిగుతుండడంతో.. పోలీసులు కూడా చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు కూడా హోంమంత్రి స్థాయికి విషయం వెళ్తే ఇబ్బందే అనే భయంతో.. వారు అడిగినంత ముట్టజెబుతూ.. సెటిల్‌ చేసుకుంటున్నారు.

ఇవీ మచ్చుకు కొన్ని ఉదంతాలు..

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న విజయనగర్‌కాలనీలో మాజీ సైనికులకు చెందిన భూమిని హోంమంత్రి సమీప బంధువు ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బండ్లగూడలో రెండున్నర ఎకరాలకుపైగా వక్ఫ్‌ భూమిని నిబంధనలకు విరుద్ధంగా హోంమంత్రి బంధువుకు లీజుకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం వేలం నిర్వహించాల్సి ఉన్నా.. రూ.20 కోట్లు విలువ చేసే భూమిని, నెలకు రూ.60వేల అద్దె ప్రాతిపదికన మూడేళ్లకు లీజుకు ఇచ్చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కూడా హోంమంత్రి బంధువులు కొందరు స్థల వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

పేషీలోనూ అదే తీరు..!

హోంమంత్రి పేషీలోనూ చేయి తడపనిదే పని జరగదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయం కోసం వచ్చే బాధితుల నుంచి కొందరు సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారు. హోంమంత్రి వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు భూ తగాదాలో జోక్యం చేసుకోవడంతో విధుల నుంచి తప్పించారు. అయినా.. తన పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి పేషీకి పోస్టింగ్‌ వేయించుకున్నాడు. సదరు అధికారి.. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పాతనగరంలో బరిలోకి దిగిన అభ్యర్థుల నుంచి మంత్రి పేరు చెప్పి ఖరీదైన సెల్‌ఫోన్లు తీసుకున్నాడు. ‘‘సార్‌తో మాట్లాడి సూర్యాపేటలో భూవివాదం పరిష్కరిస్తానం’’టూ ఓ వ్యక్తి వద్ద రూ.50 లక్షలకు డీల్‌ కుదుర్చుకుని.. రూ.4 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. పని కాకపోవడంతో బాధితుడు పదేపదే ప్రశ్నించగా.. కొంత మొత్తం ఇస్తానంటూ.. చెక్కు అందజేశాడు. జైళ్ల శాఖలో పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి సర్వీ్‌సకు సంబంధించిన అంశం పెండింగ్‌లో ఉండటంతో.. మంత్రితో చెప్పి సమస్య పరిష్కరిస్తానంటూ రూ. 2.5 లక్షలు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మంత్రి ఇంట్లో పెళ్లి జరిగిన సమయంలోనూ.. ఖర్చుల పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు.

బాధ్యులపై చర్యలు తప్పవు: హోంమంత్రి

తన పేరు, అధికారాన్ని అడ్డంపెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. తన బంధువులుగా చెప్పుకొని భూ వివాదాల్లో తలదూరుస్తున్న వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన కార్యాలయ సిబ్బందికి డబ్బులు ఇచ్చిన బాధితులు ఆ వివరాలను అందజేస్తే.. బాధ్యులను విధుల్లోంచి తొలగిస్తానని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here