100 బిలియన్‌ డాలర్లు

0
192
Spread the love

కొవిడ్‌ మహమ్మారి గత ఏడాదంతా ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించగా.. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ దానికి పరిష్కారం చూపిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, ఇక్కడ తయారైన కొవ్యాగ్జిన్‌ ప్రతి భారతీయుడూ గర్వించేలా చేసిందని చెప్పారు. హైదరాబాద్‌ ప్రపంచ టీకాల రాజధాని అని చాటిచెప్పిందన్నారు. సోమవారమిక్కడ ప్రారంభమైన 18వ బయో ఆసియా సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి ఏటా ఇచ్చే ‘జీనోమ్‌ వ్యాలీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డును ఈసారి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రూపొందించిన భారత్‌ బయోటెక్‌కు అందించారు. ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న జీనోమ్‌ వ్యాలీ అనేక అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ తయారీతోపాటు ప్రపంచానికి సరఫరా చేసే బాధ్యతలను ఇక్కడి హెటెరో ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థలు చేపట్టడం సంతోషకరమని చెప్పారు. అరబిందో ఫార్మా 450 మిలియన్‌ డోసుల సామర్థ్యంతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే అంబ్రాలిసిబ్‌ వ్యాక్సిన్‌ను జీనోమ్‌ వ్యాలీలోని కంపెనీ అభివృద్ధి చేసిందని, అమెరికాలోని ఎఫ్‌డిఏ ఆమోదించిన తొలి భారత ఔషధం ఇదే కావడం గర్వించదగిన విషయమని తెలిపారు. ఏడాదిలోపే జీనోమ్‌ వ్యాలీలో శాస్త్రవేత్తల సంఖ్య 100 నుంచి 225కి పెరిగిందన్నారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది అనేక దేశాలు తీవ్రంగా నష్టపోగా తెలంగాణలోని లైఫ్‌ సైన్సెస్‌ రంగం మాత్రం గణనీయమైన వృద్ధి నమోదు చేసిందన్నారు. ఈ రంగంలో గత ఏడాది రూ.3700 కోట్ల పెట్టుబడులు రాగా, 14వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కేటీఆర్‌ వెల్లడించారు.

అభివృద్ధికి మరిన్ని అవకాశాలు..

తమ వ్యాపారాలను జీనోమ్‌ వ్యాలీకి విస్తరించేందుకు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోని అనేక అంతర్జాతీయ కంపెనీలు సిద్ధమవుతున్నాయని కేటీఆర్‌ తెలిపారు. కెనడా కంపెనీ జాంప్‌ ఫార్మా 2018లో ప్రకటించిన జీనోమ్‌ వ్యాలీ ప్రాజెక్టు దాదాపు ముగింపు దశకు చేరుకుందని, దీన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగం 100 బిలియన్‌ డాలర్లకు ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. వైద్య పరికరాల రంగానికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌లో ఇప్పటివరకు 40 ప్రముఖ కంపెనీలు పెట్టుబడులకు సిద్ధమవ్వగా.. ఇందులో అనేక కంపెనీలు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించాయని తెలిపారు. ఈ సమావేశంలో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, రెడ్డి ల్యాబ్స్‌ అధినేత సతీ్‌షరెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీఎ్‌సఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నేడు పాల్గొననున్న సత్య నాదెళ్ల

బయో ఆసియా రెండో రోజు సదస్సు మంగళవారం ఆన్‌లైన్లో సాగనుంది. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోని ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. కేంద్ర ఔషధ మంత్రిత్వ శాఖ, ఔషధ నాణ్యత, నియంత్రణ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.45 నుంచి 15 నిమిషాల పాటు మంత్రి కేటీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో మాట్లాడనున్నారు. ‘చర్చా 2021- హెల్త్‌కేర్‌ టు హిట్‌ రీఫ్రెష్‌’ అనే అంశంపై వీరిద్దరి మధ్య సంభాషణ జరగనుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here