తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్ షర్మి ల.. జిల్లాల పర్యటనకూ సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఖమ్మం వెళ్లాలని నిర్ణయించారు. షర్మిల వెంట సుమారు 250 కార్లు ర్యాలీగా వెళ్లనున్నట్లు సమాచారం. మార్గమధ్యంలో హయత్‌నగర్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేటల్లో ఆమె అభిమానులను పలకరించనున్నట్లు చెబుతున్నారు. ఖమ్మంలోనూ వేలాది మందితో భారీ ర్యాలీలో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అనంతరం వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. ఖమ్మం పర్యటనలో గిరిజనులతోనూ షర్మిల ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అటవీ భూముల సాగు చట్టం అమల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వేలాదిమంది గిరిజనులకు పట్టాలిచ్చింది. అయితే ఈ భూములపై ప్రభుత్వానికి, గిరిజనులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదే అంశంపై ఉమ్మడి జిల్లా గిరిజనులతో షర్మిల ప్రత్యేకంగా సమావేశం కానుండడం విశేషం. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మీయ సమ్మేళనం పూర్తయింది. ఈ క్రమంలో గురువారం ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు లక్కినేని సుధీర్, శ్రీనివా్‌సరాజు, రోషిరెడ్డి తదితరులు షర్మిలను లోట్‌సపాండ్‌లో కలిశారు. ఈ సందర్భంగా తదుపరి ఆత్మీయ సమావేశాన్ని ఖమ్మంలో నిర్వహించాలని, అక్కడ భారీ ర్యాలీలోనూ పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తన ఆత్మీయులైన కొండా రాఘవరెడ్డి తదితరులతో షర్మిల సమావేశమై సమీక్షించారు.

ఖమ్మానికే భారీ ర్యాలీతో వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని రాఘవరెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా.. 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీకి వచ్చిన మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చినవే. మూడు అసెంబ్లీ సీట్లూ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలే. జిల్లా వ్యాప్తంగా వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ టీఆర్‌ఎ్‌సలో చేరిపోవడంతో వారికి వేదిక లేని పరిస్థితి నెలకొంది. చాలా మంది ఇతర పార్టీల్లో సర్దుకుని ఉన్నారు. అయితే తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న షర్మిల.. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను మొదటిసారిగా ప్రదర్శించేందుకు ఈ జిల్లానే ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీకి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశాన్నీ పెట్టుకున్నారు. ఖమ్మం తర్వాత ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక చోట ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
షర్మిలను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం లోట్‌సపాండ్‌లో షర్మిలను కలిశారు. ఆమె భర్త అనిల్‌తోనూ సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టే విషయంలో షర్మిల, జగన్‌ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే షర్మిలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రామకృష్ణారెడ్డి జగన్ తరఫున రాయబారిగా వచ్చారన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే ఆయన మర్యాదపూర్వకంగానే షర్మిలను కలిశారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఆయనే వెంట ఉన్నారని, ప్రస్తుతం ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చారని అంటున్నాయి.