తూర్పు లద్దాఖ్ పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల్లో సైనిక బలగాలను ఉపసంహరించుకునేందుకు భారత్-చైనా ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు దశలవారీగా, పరస్పర సమన్వయంతో సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకోనున్నాయి. రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈమేరకు చైనాతో కుదుర్చుకున్న ఒప్పంద వివరాలను రాజ్యసభకు గురువారం వెల్లడించారు. చైనాకు ఒక అంగుళం భూమిని కూడా వదులుకోలేదని ఆయన స్పష్టంచేశారు. ఒప్పందం అమలుతో తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే 5నాటికి ముందున్న పరిస్థితులే పూర్తిగా నెలకొంటాయని చెప్పారు. అతి త్వరలోనే పూర్తిస్థాయి బలగాల ఉపసంహరణ కుట్టుబడి ఉండాలని రెండు దేశాలు అంగీకరించాయని రాజ్‌నాథ్ సభకు తెలిపారు. భారత్ సరిహద్దు నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు చైనా అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే రక్షణమంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏర్పాటుచేసిన నిర్మాణాలను తొలగించడానికి కూడా రెండు దేశాలు అంగీకరించాయన్నారు.

తాజా ఒప్పందం ప్రకారం ఫింగర్ 8 తూర్పుదిశ వద్ద పాంగాంగ్ సరస్సు ఉత్తర ప్రాంతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) బలగాలను మోహరించుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని ఫింగర్ 3కు సమీపంలో ధన్ సింగ్ థాపా పోస్టు వద్ద పర్మినెంట్ బేస్‌లో భారత బలగాలు మోహరించుకోవచ్చు. బుధవారం నుంచి రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలవుతోందని రక్షణమంత్రి చెప్పారు. కాగా, చైనా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)వద్ద యధాతథ పరిస్థితులతోనే శాంతి సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ చేశారు. మరోవైపు, సరిహద్దులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లను అయినా సైన్యం ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని సైనికదళ ప్రధానాధికారి జనరల్ ఎంఎం నారావనె పేర్కొన్నారు. వారసత్వంగా వస్తున్న సవాళ్లు మాత్రం ఇంకా పూర్తిగా సమసిపోలేదని గురువారం ఓ కార్యక్రమలోఓ ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది జూన్‌లో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది సైనికులు మృతి చెందినట్టు రష్యా వార్తా సంస్థ టాస్ పేర్కొంది.