ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో మూడో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన దివీస్ లేబొరేటరీస్ రూ.471 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.359 కోట్లతో పోలిస్తే 31 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయం కూడా 20 శాతం వృద్ధితో రూ.1,438 కోట్ల నుంచి రూ.1,721 కోట్లకు చేరింది. 2020-21 మొదటి తొమ్మిది నెలలకు రూ.5,224 కోట్ల ఆదాయంపై రూ.1,482 కోట్ల లాభాన్ని ఆర్జించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీలో ఉత్పత్తి కార్యకలాపాలు సాధారణ స్థాయికి వచ్చినట్లు పేర్కొంది. కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులు ఎనలేని సేవలు అందించారని.. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాల రూపంలో రూ.34 కోట్లు చెల్లించినట్లు వివరించింది.