జార్ఖండ్ అనగానే ఓ పేదరాష్ట్రం, బొగ్గు గనులు, మహేంద్రసింగ్ ధోనీ గుర్తురావడం సహజం. అలాంటి చోట… ఇలాంటి నిత్య పెళ్లికూతుర్లు ఉంటారని మనం ఊహించం. కానీ ఉంది. ఇప్పటికే ఇద్దర్ని పెళ్లి చేసుకుంది. భారీగా క్యాష్ కొట్టేసింది. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంటూ… నిలువుగా దొరికిపోయింది. ఈ తంతు ఎలా జరిగిందో తెలుసుకుందాం. షాదీ డాట్ కామ్ (Shaadi.com)… అదో పెళ్లిళ్లు కుదిర్చే సైట్. అందులో ఫొటోషాప్ గ్రాఫిక్స్ చేయించుకొని… తనవి అందమైన ఫొటోలు పెట్టింది. బాగా డబ్బున్న మగాళ్లను వెతుక్కొని… వాళ్లకు ఆ ఫొటోలను పంపేది. అలా అవి చూసిన నిలయ్ కుమార్… ఇంత అందమైన భార్య నాకు వస్తే… ఇక నేను సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు అనుకున్నాడు. అలా… 2015లో అతన్ని పెళ్లి చేసుకుంది. అతని రకరకాలుగా డబ్బును లాగేయడం మొదలుపెట్టింది. క్యూట్‌గా మాట్లాడుతూ… ఏదో కారణం చెప్పేది… కట్ చేస్తే… అతని అకౌంట్‌లో మనీ… ఆమె అకౌంట్‌లోకి వచ్చేసేది. భార్యేగా… తనకు కాకపోతే… ఇంకెవరికి ఇస్తాను… అనుకునేవాడు. ఇలా రెండేళ్లలో రూ.కోటి కొట్టేసింది. ఇక లాగడానికి ఏమీ లేదని ఆమెకు అర్థమైంది. వన్ ఫైన్ డే మాయమైంది.
ఆ తర్వాత… మరో మాట్రిమోనియల్ సైట్‌లో తన ప్రొఫైల్ ఎంటర్ చేసింది. ఫొటోలు పెట్టింది. ఈసారి కూడా వాటిలో గ్రాఫిక్స్ యాడ్ చేసింది. తన పేరు మార్చేసుకుంది. ఇదివరకు పెళ్లైన విషయం చెప్పలేదు. ఈసారి గుజరాత్‌కి చెందిన అమిత్ మోదీ ఉత్సాహపడ్డాడు. ఇంత అందమైన భార్య తనకు వస్తే… ఇక తన జీవితం మారిపోయినట్లే అనుకున్నాడు. పెళ్లైపోయింది. ఆ తరవాత అప్పుడప్పుడూ ఏడ్చేది. నేనుండగా నీకు ఏడుపేంటి అనేవాడు. మీరుంటే మాత్రం మా ఫ్యామిలీ కష్టాలు తీరిపోతాయా ఏంటి… అంటూ ఏడ్చేది. నీ అందమైన కళ్లలో… ఆ కన్నీళ్లు చూడలేను… ఇప్పుడేంటి… వాళ్ల కష్టాలు తీరాలి… అంతేకదా… అంటూ చెక్ తీసేవాడు… అలా ఏడ్చిన ప్రతిసారీ… లక్షలకు లక్షలు లాగేసేది. ఇలా మొత్తం రూ.45 లక్షలు లాగేసింది. తర్వాత పెద్ద డ్రామా ఆడింది. విడాకులు కావాలంది. ఎందుకంటే… తన ప్యామిలీకి తాను అండగా నిలవాల్సిన సమయం వచ్చింది అంది. కోర్టు వాళ్లకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. బలమైన కారణం లేదని తెలిపింది. దాంతో… మరో డ్రామా ఆడింది. తన చెల్లిని జార్ఖండ్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయించి వస్తానని ఇంట్లోంచీ వెళ్లింది. ఇక తిరిగిరాలేదు. అప్పుడు అనుకున్నాడు అమిత్ మోదీ… నిజంగానే తన జీవితం మారిపోయిందని.
ఇక మూడోసారి పుణెలో మరో తంతు. ఈసారి సుమిత్ దశరథ్ పవార్… ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేసుకుందామా అని తెగ ఉబలాడపడసాగాడు. వీడెవడో పెద్ద బకరాలా ఉన్నాడు. వీడి దగ్గర కనీసం రూ.5 కోట్లు కొట్టేయాలి అనుకుంది ఆమె. ఎందుకంటే… అతను ఉంటున్నది కాలిఫోర్నియాలో. పెళ్లి తర్వాత కాలిఫోర్నియాకి తీసుకెళ్తానన్నాడు. పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకోమన్నాడు. సరే అంది లోలోపల భయపడుతూ. ఓ సందర్భంలో… ఆమె మొబైల్ ఫోన్‌ను పవార్ తల్లి పట్టుకోవాల్సి వచ్చింది. కాసేపటి తర్వాత… నా కోడలి ఫొటోలు చూస్తాను… అని అనుకుంటూ… పెద్దావిడ… మొబైల్‌ను ఓపెన్ చేసింది. నిత్యపెళ్లికూతురు… దానికి ఎలాంటి పాస్‌వర్డూ పెట్టుకోలేదు. దాంతో లోపలున్న ఫొటోలను చూసిన పవార్ తల్లి షాకులపై షాకైంది. “వామ్మో… ఇదెక్కడిదిరా నాయనో… నా కొడుకును తగులుకుంది… అందుకేనా తల ఎత్తకుండా… దించే ఉంచుతోంది” అనుకుంటూ… ఆపండి అని రజనీకాంత్‌లా గట్టిగా అరిచింది. అందరూ ముఖాలకు మాస్క్‌లు సరిచేసుకుంటూ… ఆమె వైపు చూశారు. మేటర్ అందరికీ చెప్పేసింది. దగ్గర్లోనే ఉన్న పోలీసులు కంగారుపడకుండా మామూలుగా వచ్చారు. ఇలాటివి చూసీ చూసీ వాళ్లకు ఆశ్చర్యం కలగలేదు. కట్ చేస్తే… నిత్య పెళ్లి కూతురు… కటకటాల్లో ఉంది. పాత భర్తలు తమ డబ్బును రాబట్టుకోవడానికి ట్రై చేస్తుంటే… ఆమె ఉచ్చు నుంచి బయటపడిన పవార్… దేవుడున్నాడు అనుకుంటూ… కాలిఫోర్నియా వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.