నెలలో కోటి మందికి!

0
170
Spread the love

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. నాలుగైదువారాల్లోనే కోటి మందికి వ్యాక్సిన్‌ వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున సోమవారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా వారంలో నాలుగు రోజులు మండలంలో వ్యాక్సినేషన్‌ చేపట్టాలని, రోజుకు రెండు గ్రామాల్లో వ్యాక్సిన్‌ వేయాలని ఆదేశించారు. లోపాలను సరిదిద్దాక విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ కేవలం ఆరు రోజులు మిగిలి ఉందని, ఈ  ఎన్నికలు ముగిసినట్లయితే వ్యాక్సినేషన్‌పై పూర్తిగా దృష్టి సారించేవాళ్లమన్నారు.

ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీని వల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు వచ్చే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరనే ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా మనమందరం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞాన్ని ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసినందున సోమవారం నుంచే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా విలేజ్‌ డాక్టర్‌ కాన్సె్‌ప్టను అమల్లోకి తీసుకురావాలన్నారు. గ్రామాల్లోనూ పూర్తిస్థాయి కార్యక్రమంగా వ్యాక్సినేషన్‌ అమలు చేయాలన్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్‌వర్కర్లు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ప్రజలను చైతన్యపరచి, అవగాహనకు వచ్చాకే టీకా వేయాలన్నారు. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్నారు. 104తో అనుసంధానం చేసేలా డాక్టర్లు సరిపోతున్నారా? అని ఆరా తీశారు. ఒక్కో 104 వాహనంలో ఒక్కో డాక్టర్‌ ఉండాలని, ఈ రకంగా మండలానికి ఆరుగురు డాక్టర్లు ఉండాలని పేర్కొన్నారు. నెలకు మూడుసార్లు ప్రతి గ్రామంలోనూ వైద్యులు పర్యటించి సేవలందించాలని ఆదేశించారు.

వైద్యుల నియామకానికి నిధుల ఆటంకం రానివ్వొద్దని సూచించారు. హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఇంకా 3.97 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పెండింగ్‌లో ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 60 ఏళ్ల పైబడి, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 59.08 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తానికి కోటి మందికి పైబడి వ్యాక్సినేషన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌ నిర్ధారిత పరీక్షలన్నీ ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలోనే చేయాలన్నారు. బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవల పరిధిని పెంచుతామని అధికారులు వివరించారు. మిగిలిన వాటితో పోల్చితే పాఠశాలల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్నారు. స్కూళ్లలో కేసులు వస్తే, మూడు రోజులు పాఠశాలకు సెలవు ఇచ్చి, అందరికీ కొవిడ్‌ నిర్ధారిత పరీక్షలు చేశాకే తిరిగి ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here