తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మంగళవారం నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి విజేతలకు డిక్లరేషన్లు అందజేస్తారు. వీలైతే అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. లేకపోతే మరుసటి రోజు ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం 1.30 వరకే ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి విడతలో 2,723 సర్పంచ్ స్థానాలకు, 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 7,506 మంది, వార్డులకు 43,601 మంది పోటీపడుతున్నారు.

వెలిచర్లలో ‘నో’ నామినేషన్
ఎన్నికల ఏర్పాట్ల గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం వివరించారు. ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లోనూ ‘నోటా’ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులెవరికీ ఓటు వేయకూడదని భా వించినవారు ‘నోటా’కు ఓటు వేసుకోవచ్చన్నారు. తొలిదశలో 3,249 గ్రామ పంచాయతీల్లో 525 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికను వాయిదా వేశామన్నారు. 2,723 సర్పంచ్ స్థానాల కు 7506 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. అలాగే, 32,502 వార్డు సభ్యులకు గాను 12,815 స్థానాలు ఏకగ్రీవమయ్యాయన్నారు. 160 వార్డు స్థానాలకు అసలు నామినేషన్లే వేయలేదని తెలిపారు. అలాగే, స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల తూర్పుగోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డెగూడెం గ్రామాల్లో కొన్ని వార్డులకు ఎన్నికలు వాయిదా వేసినట్టు తెలిపారు.
3,594 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు..
3,458 సమస్యాత్మక, 3,594 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించినట్టు ద్వివేది తెలిపారు. స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులుగా 1130 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులుగా 3249, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా 1432, ప్రిసైడింగ్ అధికారులుగా 33,533, ఇతర పోలింగ్ సిబ్బందిగా 44,392 మందిని నియమించామని తెలిపారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లుగా 3,047 మం దిని నియమించినట్లు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనల ప్ర కారం మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లోవ్స్ స్టేషన్ల వారీగా సిద్ధం చేశామన్నారు. పాజిటివ్ వచ్చి న వారు పోలింగ్ చివరి గంట లో వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని రెండు వార్డులకు ఎన్నికల గుర్తుల కేటాయింపులో తేడాలు జరగడంతో ఆ వార్డు సభ్యుల ఎన్నికలు వాయిదా పడ్డాయి.