రాష్ట్రంలోని పరిశ్రమలకు క్రమంగా డీశాలినేషన్ చేసిన (నిర్లవణీకరణ) నీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా రీసైకిల్ చేసిన నీటిని ఇవ్వాలని సూచించారు. రిజర్వాయర్లు, నదులు, కాల్వల్లోని నీరు, భూగర్భ జలాలను ఆదా చేయాలని.. ఆ నీటిని వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలని నిర్దేశించారు. రాబోయే 5-10 ఏళ్లలో ఈ డీశాలినేషన్ ద్వారా పరిశ్రమలకు, ఇతర అవసరాలకు మంచి నీరందించే ప్రక్రియను పూర్తిచేయాలని.. దీనికోసం ప్రత్యేకంగా పైప్‌లైన్లు వేయాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించాలని నిశ్చయించారు. పరిశ్రమలకు మంచినీటి సరఫరాపై సీఎం సోమవారమిక్కడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డీశాలినేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ) ఏర్పాటుపైనా చర్చ జరిగింది. పరిశ్రమలకు నీటిని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదని ముఖ్యమంత్రి అన్నారు.

పరిశ్రమలకు కచ్చితంగా నాణ్యమైన నీటిని అందించాలని.. దానికి యూజర్ చార్జీలు కూడా వసూలు చేయవచ్చని తెలిపారు. తీర ప్రాంతాల్లో డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటుచేసి, పైప్‌లైన్ ద్వారా ఈ నీటిని తరలించి.. పరిశ్రమలకు అందించే ఆలోచనలు చేయాలని చెప్పారు. ఎక్కడెక్కడ పరిశ్రమలున్నాయి.. ఎంతెంత నీటిని వినియోగిస్తున్నాయి.. ఆ నీటికి బదులుగా డీశాలినేషన్ నీటిని ఏ రకంగా ఇవ్వగలుగుతాం.. అన్న అంశాలపై ప్రణాళిక సిద్ధంచేయాలని ఆదేశించారు.
పరిశ్రమల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్!!
మరోవైపు.. పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. పురపాలక ఎన్నికల్లో గెలుపు అనంతరం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పెరిగిందని సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా తన శాఖల పరంగా అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. పరిశ్రమలు, ఐటీ రంగ నిపుణులు, పెట్టుబడిదారులు అందరితో సమాలోచనలు చేసి ఈ ప్లాన్‌ను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.