రాష్ట్రంలో ఇప్పటికే రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు, నాలుగు విడతల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నెల 21 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) యోచిస్తోంది. అయితే అన్నిటికంటే ముందు ప్రారంభించి ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ పరిషత్ ఎన్నికలపై కాకుండా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించడంతో ప్రభుత్వ వర్గాల్లో కూడా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే స్థానిక సంస్థలన్నిటికీ ఎన్నికలను వరుసగా పూర్తి చేయాలని.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ త్వరగా తొలగించాలని రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ద్వారా ఎస్‌ఈసీకి సూచిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉండగా ఎన్నికలు జరపడానికి తొలుత ససేమిరా అన్న ప్రభుత్వ పెద్దలు..

ఇప్పుడు ఎన్నికలన్నీ వరుసగా పూర్తి చేయాలని సలహాలివ్వడం విస్మ యం కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిరుడు ఫిబ్రవరి, మార్చిలో జరిగిన పరిషత్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రద్దుచేసి.. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిపేశామో.. కరోనా అనంతరం అక్కడ నుంచే ప్రక్రియను ప్రారంభిస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కూడా గెలిచినట్లేనని అప్పట్లో నిమ్మగడ్డ ప్రకటించారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. గతంలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తద్వారా అప్పట్లో గెలిచినట్లు ప్రకటించిన ఏకగ్రీవాలను కూడా రద్దు చేయాలని వైసీపీయేతర రాజకీయ పార్టీలన్నీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించడంపై సీఎం జగన్‌తో పాటు మంత్రులు, స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఎస్‌ఈసీ చేపట్టిన ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా కోడ్‌ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఆగడాలు శ్రుతిమించాయని.. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. నామినేషన్ పత్రాలు చించివేయడం.. అధికారులను, పోలీసులను ఉపయోగించి పోటీలో ఉన్న ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించడంపై గత ఏడాదిలో టీడీపీ, బీజేపీ, జనసేన సహా పలు ప్రతిపక్షాలు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాయి.
బీజేపీ రాష్ట్ర నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా ఫిర్యాదు చేశారు. అన్నిటికీ మించి.. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనరే.. కేంద్ర హోం కార్యదర్శికి అప్పట్లో రాసిన లేఖలో.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అక్రమాలు, దాడులు, దౌర్జన్యాల తంతును ఏకరవు పెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఏకగ్రీవమైన తీరు, ముఖ్యంగా కడప, పులివెందులలో ఓటు పడకుండానే ఏకగ్రీవాలు చేయడం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన దాడులు, అక్రమాల గురించి తెలియజేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఇవ్వడం వల్లే హింసాత్మక సంఘటనలు జరిగాయన్న ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అక్రమాలపై తానే కేంద్ర హోం శాఖకు వివరించిన కమిషనర్.. జరిగిన ఆ ఎన్నికల ప్రక్రియను ఎలా ఆమోదిస్తారని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్డు కూడా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకునే అవకాశం లేనందున ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ, ఏకగ్రీవాలను రద్దుచేసే అధికారం ఎస్‌ఈసీకి ఉందంటున్నారు.
ప్రతిఘటన తప్పదు..
కొత్త నోటిఫికేషన్ జారీచేయకుండా.. గత నామినేషన్ల ప్రక్రియనే కొనసాగిస్తే కమిషనర్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తది జారీచేస్తే రాష్ట్రప్రభుత్వం నుంచీ తీవ్ర ప్రతిఘటన తప్పదు. ఇరుపక్షాలూ దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు వేసే అవకాశముంది. ఈ చిక్కుముడిలో చిక్కుకోవడం కన్నా.. పరిషత్ ఎన్నికలను పక్కనపెట్టి మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలన్న యోచనలో నిమ్మగడ్డ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 31తో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చే రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. పరిషత్ ఎన్నికల నిర్వహణ చూసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నామినేషన్ల చెల్లుబాటుపై భిన్నాభిప్రాయాలు..
స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన ఎస్‌ఈసీ.. అప్పటికే వేసిన నామినేషన్లు చెల్లుబాటయ్యేలా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలుచోట్ల నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, పత్రాలు చించివేయడం, ఫోన్లలో బెదిరించడం, డబ్బు ఎరవేసి నామినేషన్లు పత్రాలు తీసుకోవడం, విపక్షాల అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాపుల వంటి అకృత్యాలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అధికార యంత్రాంగమే అభ్యర్థులను బెదిరించి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంది. ఇంకొన్ని చోట్ల పోలీసులే రంగంలోకి దిగి అభ్యర్థుల చేత విత్‌డ్రా చేయించారు. పలు చోట్ల అధికారులే ఫోర్జరీ సంతకాలు చేసి అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. దీంతో అన్నీ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిందని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఆమోదించడం, ఇప్పటికే పోటీ పడాల్సిన వారు పోటీలో లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరిగినట్లేనని స్పష్టం చేస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసి మళ్లీ కొత్త షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటించాలని అంటున్నారు.