భారత్, చైనా, రష్యా చెత్తదేశాలేనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా కాలుష్యరహితమేనని, మరి ఆ మూడు దేశాల మాటేమిటని బైడెన్ సర్కారును ప్రశ్నించారు. పారిస్ పర్యావరణ ఒప్పందంలో తిరిగి చేరాలన్నది అనుచిత నిర్ణయమేనని విమర్శించారు. ఓర్లాండోలో ఆదివారం జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ట్రంప్ ప్రజల ముందుకు రావడం ఇదే తొలిసారి. ‘అతి ఖరీదైన, పక్షపాతంతో కూడిన పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడం తప్పే. అత్యుత్తమ డీల్ కోసం సంప్రదింపులు జరపకపోవడం ఏమిటి’ అని ప్రశ్నించారు. తాను తిరిగి అధ్యక్ష పదవికి పోటీపడతానని సూచనప్రాయంగా తెలిపారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏ కోశానా లేదని స్పష్టం చేశారు. దాని వల్ల సంప్రదాయవాదుల ఓట్లు చీలిపోతాయే తప్ప ప్రయోజనం ఉండబోదని చెప్పారు. రిపబ్లికన్లు అందరూ ఏకతాటిపైకి రావాలని, 2022లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమొక్రాట్లను ఓటించాలని పిలుపునిచ్చారు. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. బైడెన్ సర్కారు నిర్ణయాలన్నీ అమెరికాను సామ్యవాదం దిశగా తీసుకెళ్లేలా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వరాదని చెప్పారు. కేవలం నెల రోజుల పాలనలో ‘అమెరికా ఫస్ట్’ను కాస్తా ‘అమెరికా లాస్ట్’గా మార్చేశారని ఆరోపించారు. ఇప్పటిదాకా తీసుకున్నవన్నీ తిరోగమన నిర్ణయాలేనని ధ్వజమెత్తారు.
