రానున్న వారాల్లో రైతుల ఆందోళన మళ్లీ ఉధృతరూపం దాల్చనుంది. 3.5 లక్షల ట్రాక్టర్లతో 25 లక్షల మంది రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశిస్తారని, బారికేడ్లు బద్దలు కొట్టుకుని ముందుకెళ్తా మని రైతు నేత రాకేశ్ తికాయత్ ప్రకటించారు. అంతేకాదు.. ఏకంగా పార్లమెంట్లోనే ఒక మండీని నెలకొల్పుతామని, సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం)లో దీన్ని చర్చించాక తేదీ ఖరారవుతుందని శనివారం మమతా బెనర్జీ పోటీచేస్తున్న నందిగ్రామ్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయతీలో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఓటేయొద్దని తికాయత్ బెంగాల్‌లోని రైతులను కోరారు. ‘నందిగ్రామ్ అంటే ఒకనాడు రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన నేల. ఇపుడీ నేల మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనకు కొత్త దిశను చూపాలి’ అని తికాయత్ కోరారు. బీజేపీ కూడా రైతు సభలు నిర్వహిస్తూ ఓట్లడగడాన్ని విమర్శించారు.

అది దాడి కాదు.. ప్రమాదమే: పరిశీలకులు
నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై ఎలాంటి దాడి జరగలేదని, ఆమె ప్రమాదవశాత్తూ గాయపడ్డారని ప్రత్యేక పరిశీలకులుగా నియమితులైన ఇద్దరు అధికారులు ఈసీకి నివేదిక ఇచ్చారు. ‘ఆమెపై దాడి కోసం ఎలాంటి మూకా రాలేదు. ప్రమాద సమయంలో ఆమె భారీ పోలీసు బందోబస్త్ మధ్య ఉన్నారు’ అని వివేక్ దూబే, అజయ్ నాయక్ అనే పరిశీలకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ నివేదిక తూతూ మంత్రంగా ఉందని ఈసీ పేర్కొన్నది.