హైదరాబాద్: కోవిడ్–19 ప్రభావంతో గతేడాది మరణించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేశ్ భార్య పావనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 కేడర్ ఉద్యోగం (వైద్య,ఆరోగ్య శాఖలో పరిపాలనా ధికారి) ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పావనికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పావని ఉద్యోగం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటలకు పావని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పావని తండ్రి సత్యనారాయణ, కుమార్తెలు సంజని, శరణితో పాటు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డా.కత్తి జనార్దన్, సెక్రెటరీ జనరల్ డా. పూర్ణచందర్, వైస్ ప్రెసిడెంట్ డా.రాంబాబు తదితరులున్నారు.