ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కంటే.. ‘పిచ్’ గురించిన రచ్చే ఎక్కువైంది. ఐదు రోజుల మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగియడంతో ఇక్కడి వికెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇది టెస్ట్ మ్యాచ్‌కు పనికి రాదనే విమర్శలు వినిపించాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్, కొందరు మాజీ క్రికెటర్లు పిచ్‌ను దుమ్మెత్తిపోశారు. టీమిండియా వెటరన్ హర్భజన్ సింగ్, మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పిచ్ తీరును ఆక్షేపించారు. మరి కొందరు వికెట్‌లో లోపమా? లేక బ్యాట్స్‌మెన్ వైఫల్యమా? అర్థంకాక తలలు పట్టుకొన్నారు. దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం పిచ్‌లో ఏమీ లేదని.. ఇంగ్లండ్ ఆటగాళ్ల అతి జాగ్రత్తే వాళ్ల కొంప ముంచిందని విశ్లేషించాడు. కానీ, మరోరోజు గడిచే సరికి పిచ్‌ను విమర్శించే వారికంటే.. ఆటగాళ్ల ప్రదర్శనే పేలవం అనే వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక్కడి పిచ్ సవాల్ విసిరే వికెటే అయినా.. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ వైఫల్యమే ఎక్కువగా కనిపించిందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్, కామెంటేటర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. మైకేల్ వాన్ మాత్రం వికెట్ టెస్ట్‌లకు పనికిరాదని ట్వీట్ చేశాడు.

కాగా, బ్రిటిష్ మీడియా మాత్రం రెండుగా విడిపోయింది. ఓ వర్గం పిచ్ దారుణంగా ఉందని విమర్శిస్తే.. ది గార్డియన్ పత్రిక మాత్రం ఇంగ్లండ్ ఆటనే ఎక్కువగా తప్పుబట్టింది. రొటేషన్ పాలసీ కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్లే ఘోర పరాభవం ఎదురైందని రాసింది. ఇంగ్లండ్ నుంచి ఇంతటి దారుణ ప్రదర్శన చూడలేదని విజ్డెన్ పేర్కొంది. అయితే, ద మిర్రర్ పత్రిక మాత్రం.. టీమిండియా తన ప్రయోజనాల కోసం హద్దులు దాటుతున్నదంటూ తన అక్కసు వెళ్లగక్కింది. మొతేరాలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించాలని మరో మాజీ ఆటగాడు డిమాండ్ చేశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రూట్ సేన బెదిరిన కుందేలులా కనిపించిందని ఆ దేశ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఎద్దేవా చేశాడు.
రబ్బర్ సోల్ షూ వాడితే..
రబ్బర్ సోల్ ఉన్న షూ వేసుకొని బ్యాటింగ్ చేస్తే ఇలాంటి వికెట్లపై రాణించవచ్చని టీమిండియా మాజీ సారథి, హైదరాబాదీ అజరుద్దీన్ సలహా ఇచ్చాడు. ఎంతో క్లిష్టమైన పిచ్‌లపై ఈ టెక్నిక్‌తోనే చాలామంది బ్యాట్స్‌మెన్ అమోఘంగా రాణించారన్నాడు. స్పైక్స్ వేసుకొన్నప్పుడు పాదాల కదలిక అంత వేగంగా ఉండదన్నాడు. కాగా, స్పిన్నర్లకు ఎక్కువ వికెట్లు పడినప్పుడే ఎందుకు రచ్చచేస్తున్నారో అర్థం కావడం లేదని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా అసహనం వ్యక్తం చేశాడు. ‘బ్యాట్స్‌మెన్ ఓ ఇన్నింగ్స్‌లో 400 బాదితే పిచ్ గురించిన ప్రస్తావనే రాదు. పేసర్లు రాణించినా ఎవరూ మాట్లాడర’ని ఓఝా అన్నాడు. అయితే, పిచ్‌పై ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లీ, రూట్ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కానీ, బ్యాట్స్‌మెన్ వైఫల్యమే ఎక్కువగా కనిపించిందని విరాట్ అన్నాడు. ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
మైండ్‌సెట్ మారాలి – రోహిత్ శర్మ
పిచ్‌పై దెయ్యాలు లేవు. వికెట్ కాపాడుకోవాలనే ఆలోచన కంటే.. పరుగులు సాధించాలనే దృక్పథమే మొతేరా పిచ్‌పై కీలకం. ఇంగ్లండ్ ఆటగాళ్లే కాదు.. భారత బ్యాట్స్‌మెన్ కూడా తప్పులు చేశారు. వికెట్లకు నేరుగా విసిరిన బంతులకే ఎక్కువ మంది అవుటయ్యారు. నిలబడితే స్కోరు చేయడం తేలిక.