కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతిపాలన దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్‌జీ) డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. ఆ మేరకు కేంద్రహోంశాఖకు సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం, ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఆమె ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే తమిళిసై పుదుచ్చేరి పరిస్థితి గురించి కేంద్రపెద్దలకు వివరించారని, అందుకు అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని రాజ్‌నివాస్ వర్గాలు వెల్లడించాయి. అందువల్ల తమిళిసై సిఫారసు ఢిల్లీ చేరగానే రాష్ట్రపతి పాలనపై ప్రకటన వెలువడే అవకాశముందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వారం రోజులుగా పుదుచ్చేరి రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల కారణంగా వి.నారాయణస్వామి ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకేలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో నారాయణస్వామి బలనిరూపణ చేసుకోవాలని ఎల్‌జీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సోమవారం బలపరీక్షకు సిద్ధమైన నారాయణస్వామి ప్రభుత్వం పరాజయం పాలైంది. దాంతో మరో మార్గంలేకపోవడంతో నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 14 మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రతిపక్షపార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తుందేమోనని ఎల్‌జీ వేచిచూస్తున్నారు. అయితే ఏడుగురు ఎమ్మెల్యేలున్న ప్రధానప్రతిపక్షమైన ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్.రంగస్వామి అందుకు విముఖత చూపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

త్వరలో ఎన్నికలు జరుగనుండడంతో ఈ కొద్దిరోజులకు ఎందుకు తొందరపడాలని ఆయన యోచిస్తుండడం తెలిసిందే. అంతేగాక నారాయణస్వామి ప్రభుత్వాన్ని కూల్చి, తను గద్దెనెక్కానన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని తాను.. ఇప్పుడలాంటి అపవాదుకు ఆస్కారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన మిత్రపక్షాలకు తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో చేసేదిలేక అన్నాడీఎంకే, బీజేపీలు మిన్నకుండిపోయాయి. అంతేగాక బీజేపీ ఎమ్మెల్యేలు రంగస్వామి ఉద్దేశాన్ని తమ పార్టీ అదిష్ఠానానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు సోమవారం అసెంబ్లీలో జరిగిన పరీక్షా వీడియో దృశ్యాలను తెప్పించుకున్న గవర్నర్.. వాటిని సైతం కేంద్రానికి పంపించనున్నారు. ఇప్పటికే ఆమె న్యాయనిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందువల్ల అధికారపక్షం కూలిన విధానం, ప్రతిపక్షాల నిస్సహాయత, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తదితరాలన్నింటినీ క్షుణ్ణంగా నివేదిక రూపంలో కేంద్రహోంశాఖకు పంపించేందుకు తమిళిసై ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా వుండగా నారాయణస్వామి, ఆయన మంత్రివర్గం చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.