పెట్రో ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల తయారీ, ఉత్పత్తి రంగాల్లో వ్యయాలపై ప్రభావం పడుతోందని, ఇది ద్రవ్యోల్బణంపై ఒత్తిడికి దారితీస్తుందని చెప్పారు. ప్రభుత్వాల ఆదాయ అవసరాలేంటో అర్థం అవుతున్నా ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉంటుందన్న విషయాన్ని మరచిపోరాదన్నారు. పెట్రో ధరలపై పన్నులు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరమన్నారు.

గురువారం బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శక్తికాంత్‌దాస్ మాట్లాడారు. కేంద్రం, రాష్ర్టాలపై ఆదాయపరంగా ఒత్తిడులున్నాయని, కొవిడ్ వల్ల ఏర్పడిన ఇబ్బందుల నుంచి ప్రజలను బయటపడేసేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ముడిచమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు ధరలు పెంచుతున్న ఫలితంగా దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు ప్రియమవుతున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.