పెద్దిరెడ్డి, బొత్సకు హైకోర్టు నోటీసులు

0
207
Spread the love

రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గవర్నర్‌కు తాను రాసిన లేఖలు లీక్‌ కావడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై 72 గంటల్లో మధ్యంతర నివేదిక అందజేసేలా సీబీఐని ఆదేశించాలని ఆయన కోరారు. లేఖల్లోని సమాచారం లీక్‌ కావడంపై విచారణ జరిపించడంలో గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి విఫలమయ్యారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం విచారణ జరిపారు. ఇద్దరు మంత్రులతో పాటు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, సీబీఐకి కూడా నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

సీబీఐ విచారణ జరిపించాలి

నిమ్మగడ్డ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్‌ రాసిన లేఖలు లీకయ్యాయి. సోషల్‌ మీడియా, పత్రికల్లో విస్తృతంగా ప్రచురితమయ్యాయి. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు లీక్‌ కావడం వల్ల రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తుల విధులకు ఆటంకం కలుగుతుంది. గవర్నర్‌కు రాసిన లేఖలు లీక్‌ కావడంతో ఇద్దరు మంత్రులు తమ ప్రతిష్ఠకు భంగం కలిగిందని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ వివరణ ఇవ్వాలని కమిషనర్‌కు నోటీసు పంపించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మెట్టు రామిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ నెల 12న గవర్నర్‌కు కమిషనర్‌ రాసిన లేఖను పొందుపరిచారు. గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ఈ లేఖలు తమ కార్యాలయం నుంచి లీక్‌ కాలేదని చెబుతున్నారు.

లేఖలు లీక్‌ కావడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి.. లేఖ రాసిన వారి వైపు నుంచి; రెండు.. లేఖ అందుకున్న వారి వైపు నుంచి లీక్‌ కావాలి. ఈ రెండు తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించండి’ అని అభ్యర్థించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. లేఖలు లీక్‌ కావడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. రాతపూర్వకంగా ఆయనకు ఫిర్యాదు చేయలేదని.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిని కోరామని ఆదినారాయణరావు బదులిచ్చారు. గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖలు లీక్‌ కాలేదని ముఖ్య కార్యదర్శి తెలిపారని.. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు.

ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. మంత్రులకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వాలని వ్యాజ్యంలో కోరలేదని.. ప్రస్తుతం వారికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని ఆదినారాయణరావు అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్న వారందరికీ నోటీసులు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ఈ వ్యాజ్యం విచారణార్హతపై వాదనలు వినాలని కోరారు. ప్రస్తుతం నోటీసులు జారీ చేస్తున్నామని.. 30న పూర్తిస్థాయి విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here