రాష్ట్రంలో ఎండ, వడగాలి మరింత పెరగనున్నది. తూర్పు, ఆగ్నేయ గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు మండలాల్లో 41-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. గురువారం తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 106 మండలాల్లో ఒక మాదిరిగా వడగాడ్పులు వీయనున్నాయని పేర్కొంది.

అలాగే శుక్రవారం 24 మండలాల్లో తీవ్రంగా, 144 మండలాల్లో ఒక మాదిరి వడగాడ్పులు వీయనున్నాయని తెలిపింది. అడ్డతీగల, రాజవొమ్మంగి, కోట నందూరు, ఏలేశ్వరం, గంగవరం, రంపచోడవరం, దేవీపట్నం, గోకవరం మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని.. విజయవాడ, ఏలూరు నగరాల్లోనూ ఎండ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రజలు ఎండ, వడగాలి బారిన పడకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.