పొంచి ఉన్న కరోనా

0
353
Spread the love

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో పాజిటివ్‌లు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో యవత్మాల్‌ జిల్లాలో ఏకంగా 10 రోజుల లాక్‌డౌన్‌ విధించారు. ఈ రెండు రాష్ట్రాలకు తెలంగాణ నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో మనదగ్గర సైతం వైరస్‌ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడి చర్యలను విస్తృతం చేయనుంది.

చాపకింద నీరులా..

భారీస్థాయిలో కానప్పటికీ.. రాష్ట్రంలో వారం నుంచి కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు మనదగ్గర కేసులు తగ్గడంతో ప్రజల్లో వైరస్‌ భయం పోయింది. పదిశాతం మంది కూడా మాస్కులు పెట్టుకోవడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ తీరును గమనించిన వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్త చర్యలకు దిగింది. పొరుగు రాష్ట్రాల పరిస్థితిని పేర్కొంటూ.. అన్ని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా పరీక్షల సంఖ్యను మళ్లీ పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 25 వేలలోపే పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,076 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలు, 20 ఆర్టీపీసీఆర్‌ కేంద్రాల్లో టెస్టులను పెంచనున్నారు.

లక్షణాలుంటే టెస్టులకు వెళ్లండి

కరోనా అనుమానిత లక్షణాలున్నవారంతా కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని వైద్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు అనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తోంది. ఇదేసమయంలో లక్షణాలు కనిపించినవారికి పరీక్షలు చేయాలని క్షేత్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం లక్షణాలు కనిపించని కేసులే ఎక్కువగా వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తొలినాళ్లలో లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో పరీక్షలకు వెళ్లేవారని.. ఇప్పుడు స్వల్పంగా ఉండటంతో ముందుకురావడం లేదని వివరిస్తున్నారు. వీరివల్లే వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఊపిరితిత్తుల సమస్యతో చేరికలు పెరుగుతున్నాయి

ప్రస్తుతం పాజిటివ్‌లు, మరణాలు తగ్గినా ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి వైరస్‌ సోకినవారిలో లక్షణాలు కనిపించడం లేదని తెలుస్తోంది. మన దగ్గర సెకండ్‌ వేవ్‌ అంటూ వస్తే కేవలం కొత్త రకం వైరస్‌తోనే సాధ్యం.

-డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ, క్రిటికల్‌ కేర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి

ముప్పు తప్పిందన్న అజాగ్రత్త వద్దు

కేసులు తగ్గాయని ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దు. మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులతో అప్రమత్తంగా ఉన్నాం. కరోనా అనుమానిత లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

  • డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

రాష్ట్రంలో వారం రోజులుగా కేసుల తీరు

తేదీ కేసులు

15..2.21 99

16.2.21 129

17.2.21 148

18.2.21 163

19.2.21 165

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here