కరోనాపై పోరులో ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా ముందు వరుసలో నిలిచిన పోలీసులు, మునిసిపల్, రెవెన్యూ సిబ్బందికి ఈ నెల 8 నుంచి కొవిడ్ టీకాలు ఇవ్వనున్నారు. ఈ కేటగిరీలో మొత్తం 1.87 లక్షల మందిని గుర్తించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు వెల్లడించారు.

వీరిలో ఒక్క పోలీసు శాఖకు చెందినవారే 1.07 లక్షల మంది, మునిసిపల్ శాఖ తరఫున 55,000 మంది, రెవెన్యూ సిబ్బంది 25,000 మంది ఉన్నారని తెలిపారు. ఈ మొత్తంలో 10ు మంది వివిధ కారణాలతో టీకాకు దూరంగా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాల అంచనా. మిగతా వారందరికీ 10 రోజుల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తిచేస్తామని గడల శ్రీనివాసరావు చెప్పారు. వీరికి ఫిబ్రవరి మూడోవారం నుంచి రెండో డోసు టీకాలు ఇస్తామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్య సిబ్బందికి టీకా వేసేందుకు డెడ్‌లైన్‌ను ఈ నెల 5గా నిర్ణయించామని గడల శ్రీనివాసరావు తెలిపారు.
ఆలోగా టీకాలు తీసుకోని వారిని.. కొవిన్ యాప్‌లో ఆబ్సెంట్/రిఫ్యూజీ కింద గుర్తిస్తామని, టీకా తీసుకునేందుకు వారికి మరో అవకాశం ఉండబోదని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తొలి విడత టీకా గత నెల 16న ప్రారంభమవ్వగా.. జనవరి చివరికల్లా 1,71,375 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి గాను.. 1,09,015 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రైవేటులో 1,54,396 హెల్త్‌వర్కర్లకు గాను.. 56,865 మందే టీకా తీసుకున్నారు. రెండు కేటగిరీల్లో కలిపి ఇంకా 1,59,891 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. వీరందరికీ టీకా తీసుకోవడానికి మరో మూడు రోజులే గడువు ఉంది. హెల్త్‌వర్కర్లకు ఈ నెల 15 నుంచి రెండో డోసు ఇస్తామని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రానికి మరో 74 వేల కొవిషీల్డ్ డోసులు
రాష్ట్రానికి మంగళవారం మరో 74 వేల కొవిషీల్డ్ డోసులు వచ్చినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రెండు విడతల్లో 3.64 లక్షల కొవిషీల్డ్, 1.89 లక్షల కొవాగ్జిన్ డోసులు రాష్ట్రానికి చేరాయి. ఈ స్టాకుతో వైద్య సిబ్బందితోపాటు.. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోసుకు కూడా నిల్వలు ఉంటాయి.