తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత.. మూఢాలు తొలగిపోయి.. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. సాధారణంగా ఈ సీజన్‌లో ఫంక్షన్ హాళ్లకు అడ్వాన్స్ బుకింగ్‌లు ఉంటాయి. గత ఏడాది కరోనా కల్లోలంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఈసారి పరిస్థితి కొంత అనుకూలంగా ఉండొచ్చని అంతా భావించినా.. సెకండ్ వేవ్ ముంచుకొస్తోంది. కేసుల ఉధృతి పెరుగుతోంది. లాక్‌డౌన్ ఉండబోదంటూ సీఎం కేసీఆర్ చెప్పినా.. శుభకార్యాల నిర్వహణపై ఆంక్షలు తప్పనిసరి అని పేర్కొనడంతో ఈ సారీ కష్టాలు తప్పవని ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు.. పెళ్లిళ్లకు సంబంధించి కేటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది.

ఆగస్టులోనే తెరిచినా..
కరోనా అన్‌లాక్‌లో భాగంగా గత ఏడాది ఆగస్టులోనే ఫంక్షన్ హాళ్లకు అనుమతినిచ్చారు. పెళ్లికి 100 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. గురు, శుక్ర మౌఢ్యాల కారణంగా ముహూర్తాలు లేక.. ఫంక్షన్ హాళ్లు పెద్దగా తెరుచుకో లేదు. ఈ ఉగాది తర్వాత.. ఏప్రిల్ 28 నుంచి మే, జూన్ నెలల్లో కొద్దో గొప్పో ముహూర్తాలు ఉన్నాయనుకుంటే.. ఇప్పుడు సెకండ్ వేవ్ ముంచుకొస్తోందని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. అటు.. తల్లిదండ్రులు కూడా కరోనా బెంగతో.. హంగూఆర్భాటాల్లేకుండా పెళ్లిళ్లు చేయడానికి మొగ్గుచూపుతుండడంతో.. ఈ సారి కూడా వ్యాపారం అంతంతగానే ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే.. ఫంక్షన్ హాళ్లను ముందస్తుగా బుక్ చేసుకున్న వారు కూడా.. అప్పటికి కరోనా పరిస్థితులను బట్టి, పెళ్లిళ్లను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు.
చిన్న ఫంక్షన్ హాళ్లకే మొగ్గు!
ఒకవేళ కరోనా కేసులు పెరిగినా.. లాక్‌డౌన్ విధించినా.. చిన్న ఫంక్షన్ హాల్‌లో అయితే.. దగ్గరివారిని మాత్రమే ఆహ్వానించి, వివాహాలు జరిపించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం చిన్న, బడ్జెట్ ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరగడమే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో బడ్జెట్ హోటళ్లలోని బాంకెట్ హాళ్లకూ డిమాండ్ పెరుగుతోంది. ఇక హంగూ ఆర్భాటాల్లేకుండా పెళ్లిళ్లు జరిగిపోతుండడంతో.. డెకరేషన్ల గురించి ఎవరూ ఆలోచించడం లేదు.
రెండు ఆర్డర్లు రద్దయ్యాయి
కరోనా సెకండ్‌వేవ్ ప్రభావం డెకరేషన్ రంగంపై తీవ్రంగా ఉంది. మల్లాపూర్‌లోని సాయిగార్డెన్, సుచిత్ర చౌరస్తాలోని స్వాగత్ హోటల్‌లో డెకరేషన్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. పెళ్ళిళ్ల కోసం సుచిత్ర హోటల్‌లో ఏప్రిల్ 4న ఫంక్షన్ బుక్ అయ్యింది. సెకండ్ వేవ్‌తో రద్దు చేసుకున్నారు. మల్లాపూర్‌లోని సాయిగార్డెన్‌లో మే 6న ఆర్డర్ తీసుకున్నాం. కరోనా వల్ల దాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇలా నగరంలో అనేక ఫంక్షన్ హాల్స్, హోటల్స్, బాంకెట్ హాల్స్‌లలో శుభకార్యాలకు ఆర్డర్ తీసుకున్నాక తర్వాత రద్దు చేసుకుంటున్నారు.
రేషం మల్లేశ్, డెకరేటర్, రాంనగర్
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం
కరోనాతో.. టెంట్ హౌస్ యజమానుల ఆర్థిక స్థితి అగమ్యగోచరంగా మారింది. పెళ్ళిళ్లు శుభకార్యాల ఆర్డర్స్ రావడం లేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కరెంట్ బిల్లులు, షాపుల అద్దె, కార్మికుల జీతాలు చెల్లించలేక తంటాలు పడుతున్నాం.
బి.కనకరాజ్, టెంట్‌హౌస్ నిర్వాహకుడు, రాంనగర్