రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు ఫిబ్రవరి 1నుంచి తెరుచుకోనున్నాయి. 1 నుంచి 5 వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా పాఠశాలలు నిర్వహణ ఉంటుంది. తరగతి గదిలో 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు.
కొవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నారు. గదులు సరిపోని చోట రోజు మార్చి రోజు తరగతులు జరుగుతాయి.
తల్లిదండ్రులు/ సంరక్షకుల లిఖిత పూర్వక హామీతో పాఠశాలలకు విద్యార్థుల అనుమతి ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో ఫిబ్రవరి 1 నుంచి 1-5 తరగతులు ప్రారంభించేందుకు వీలుగా పాఠశాల విద్యా సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు పలు సూచనలతో మెమో జారీ చేశారు.
ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ విడుదల చేయనున్న అకడమిక్ క్యాలెండర్ మేరకు ఉదయం 9నుంచి సాయంత్రం 3.45గంటల వరకు పూర్తిస్థాయి(ఫుల్ డే)లో ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొన్నారు.