రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈనెల 18న శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2021-22) ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ అంచనాలకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బడ్జెట్‌కు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తర్వాత హరీశ్ ఇప్పటికే ఒకసారి అధికారులతో సమావేశమై బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం మరోసారి చర్చించారు. ఒకటి రెండు రోజుల్లోనే బడ్జెట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత బడ్జెట్ అంచనాలు ఖరారవుతాయి. కాగా, ఈసారి వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి ఆయా రంగాలు కోలుకుంటున్నాయి. కొన్ని రంగాలు ఇంకా కోలు కోలేదు. అవి పూర్వ స్థితికి రావడానికి మరింత సమయం సట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడి కూడా పరిమితంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటించాల్సి ఉంది. నిరుద్యోగ భృతి అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు వంటి అంశాలు సరేసరి. ఈ అవసరాలకు భారీగా నిధులు అవసరముంటుందని అంచనా వేస్తున్నారు. భూముల అమ్మకం ద్వారా నిధులను సమీకరించాలన్న ఆలోచనను ఈ ఏడాది అమలు చేయలేకపోయారు. వచ్చే ఏడాదైనా దానిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం.