ఉద్యోగాల ఉప్పెన!

0
188
Spread the love

న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాల కల్పన అనూహ్యంగా పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. గత నెలలో దాదాపు 1.2 కోట్ల మందికి ఉద్యోగాలు లభించాయని తాజా నివేదికలో వెల్లడించింది. తద్వారా దేశంలో నిరుద్యోగిత రేటు గత నెలలో 6.5 శాతానికి తగ్గింది. 2020 డిసెంబరులో ఇది 9.1 శాతంగా ఉంది. మరిన్ని ముఖ్యాంశాలు..

ఒక నెలలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఇదే అత్యధికం. గత ఏడాది మార్చికి ముందు నమోదైన నెలవారీ ఉద్యోగాల కల్పన సగటు 50 లక్షలతో పోల్చినా రెట్టింపు కంటే అధికం.

2020 డిసెంబరు చివరి నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య 38.88 కోట్లుగా ఉండగా.. 2021 జనవరి చివరి నాటికి 40.07 కోట్లకు పెరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత నెలవారీ ఉద్యోగాల కల్పనలో ఇదే అత్యధిక స్థాయి.

దేశంలో ఉద్యోగ రేటు డిసెంబరులో నమోదైన 36.9 శాతం నుంచి జనవరిలో 37.9 శాతానికి పెరిగింది.

జనవరిలో ఉద్యోగాల కల్పన భారీగా పెరగడంతో దేశంలోని నిరుద్యోగుల సరాసరి 3.3 కోట్ల నుంచి 2.79 కోట్లకు తగ్గింది.

ఈ ఏడాది 23వేల మంది ఫ్రెషర్ల నియామకం

ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌.. భారత్‌లో నియామకాల జోరు పెంచనుంది. ఈ జనవరి-మార్చి త్రైమాసికానికి ఎన్నడూ లేని స్థాయిలో ఫ్రెషర్లు, అనుభవజ్ఞుల నియామకాలు చేపట్ట నున్నట్లు కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. ఈ ఏడాది మొత్తానికి 23,000 మందికి పైగా ఫ్రెషర్లను చేర్చుకునే అవకాశం ఉందన్నారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాగ్నిజెంట్‌కు భారత్‌లోనే 2,04,500 మంది ఉద్యోగులున్నారు. గత ఏడాదిలో ప్రాంగణ నియామకాల ద్వారా 17,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకున్నట్లు నంబియార్‌ తెలిపారు. 2020తో పోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్ల హైరింగ్‌ 35 శాతం వరకు పెరగవచ్చని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here