ఊహించిన విధంగానే హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో నమోదైన తొలి రోజే మదుపర్లకు ఆకర్షణీయ లాభాలను పంచాయి. పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరును రూ.575కు కేటాయించగా.. బీఎస్‌ఈలో తొలి రోజు 85 శాతం లాభంతో రూ.1,063.90 వద్ద నమోదైంది. ఒక దశలో రూ.1,154 (100.69% అధికంగా) గరిష్ఠ స్థాయిని తాకి చివరకు 88.21 శాతం లాభంతో తొలి రోజు రూ.1082.25 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో 82.60 శాతం ప్రీమియంతో రూ.1050 వద్ద నమోదైంది. చివరకు ఇష్యూ ధరతో పోలిస్తే 87.53 శాతం లాభంతో రూ.1078.30 వద్ద క్లోజైంది. బీఎ్‌సఈలో 16.30 లక్షల షేర్లు, ఎన్‌ఎ్‌సఈలో 1.49 కోట్ల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,328.96 కోట్లుగా ఉంది.

నష్టాల్లో స్టాక్‌మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1,035 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన బీఎ్‌సఈ సెన్సెక్స్.. చివరికి 394 పాయింట్ల నష్టంతో 50,395.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 101.45 పాయింట్ల నష్టంతో 14,929.50 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరిలో రిటైల్ ధరల సూచీ మళ్లీ ఎగబాకడంతోపాటు జనవరిలో పారిశ్రామికోత్పత్తి క్షీణించడం దలాల్‌స్ట్రీట్ వర్గాల ట్రేడింగ్ సెంటిమెంట్‌కు గండికొట్టింది.
అనుపమ్ రసాయన్‌కు భారీ స్పందన
ప్రత్యేక రసాయనాల కంపెనీ అనుపమ్ రసాయన్ ఐపీఓకు మార్కెట్లో స్పందన బాగుంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ రెండో రోజు ముగిసేసరికి 3.67 రెట్ల బిడ్లు లభించాయి. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.760 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కల్యాణ్ జువెలర్స్ రూ.352 కోట్లు సేకరణ
మంగళవారం నుంచి ఇష్యూకి వస్తున్న కల్యాణ్ జువెలర్స్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.352 కోట్లు సేకరించింది. రూ.1175 కోట్ల పరిమాణం గల ఈ ఇష్యూలో షేరు ధర శ్రేణి రూ.86-87. గురువారం ఇష్యూ ముగుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లు కేటాయించారు.