ఏసీలకు ధరల సెగ

0
231
Spread the love

వేసవి వచ్చిందంటే ఎవరైనా చల్లని ఏసీ గాలులతో సేద దీరాలనుకుంటారు. కాని ఈ ఏడాది ఏసీలు కొనుగోలుదారులకు వేడి పెంచనున్నాయి. ఏసీల విక్రయానికి పలు కంపెనీలు సన్నాహాలు చేసుకుంటూనే వాటి తయారీలో ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది ఏసీల ధర 5-8 శాతం మధ్యన పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ధరలు పెంచినా ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసం కంపెనీలు ప్రకటించాయి. గత రెండు, మూడు నెలల కాలంలోనే విక్రయాల్లో 25 శాతం వృద్ధి నమోదైనట్టు పానాసోనిక్‌ ప్రతినిధి తెలిపారు. మొత్తం మీద ఏసీల తయారీపై 10 నుంచి 12 శాతం భారం పడినా తొలి విడతలో 5-6 శాతం మేరకు ధరలు పెంచామని, ఏప్రిల్‌లో మరో 5-6 శాతం పెరగవచ్చునని వినియోగ ఎలక్ర్టానిక్స్‌, అప్లయెన్సెస్‌ తయారీదారుల సంఘం (సియామా) ప్రెసిడెంట్‌ కమల్‌ నంది అన్నారు. ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

పెరిగిన ఉత్పత్తి వ్యయం

ఏసీ తయారీలో ఉపయోగించే కొన్ని మెటల్స్‌, కంప్రెసర్ల ధర పెరగడం వల్ల ధరలు పెంచక తప్పదనే అభిప్రాయం పలు కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. తాము ఈ సారి ఏసీల ధర 3-5 శాతం పెంచాలనుకుంటున్నట్టు దైకిన్‌ సీఈఓ కన్వల్‌జీత్‌ జావా తెలిపారు. విక్రయాలపై ఈ పెంపు ప్రభావం కొంత పడుతుందని ఆయన అంగీకరించారు. ధర 6-8 శాతం పెంచాలనుకుంటున్నట్టు పానాసోనిక్‌ సీఈఓ మనీష్‌ శర్మ తెలిపారు. ఏసీల విభాగంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్‌ కంపెనీ వోల్టాస్‌ ఇప్పటికే అన్ని రకాల ఏసీల ధరలు పెంచింది. తాము ఇప్పటికే ఏసీల ధర 5-8 శాతం పెంచినా ఏప్రిల్‌లో మరో 3 శాతం వరకు పెంచే ఆస్కారం ఉన్నట్టు బ్లూస్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ త్యాగరాజన్‌ చెప్పారు. ధరల పెంపు ప్రభావం హై ఎండ్‌ విభాగంపై పడినా దిగువ శ్రేణి ఏసీల విక్రయాలు మాత్రం పెరుగుతాయన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. పైగా కరోనా సంక్షోభం కారణంగా చాలా మంది వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారని, జనం కూడా ఎక్కువగా ఇళ్లకే పరిమితం అవుతున్నారని, ఇది ఏసీల విక్రయానికి సహాయకారి అయ్యే అంశమని ఆయన అన్నారు. తాము విక్రయాల్లో 40-45 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు ఎల్‌జీ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌బాబు తెలిపారు.

కొత్త ఫీచర్లు, ఆఫర్లు

ప్రస్తత మహమ్మారి నేపథ్యంలో సమాజంలో పెరిగిన ఆరోగ్యం, పారిశుధ్య చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో ఏసీలు విడుదల చేశాయి. అలాగే అమ్మకాలు పెంచుకునేందుకు ఎప్పటివలెనే నో కాస్ట్‌ ఈఎంఐ, క్యాష్‌బాక్‌ వంటి ఎన్నో ప్రోత్సాహకాలు కూడా సిద్ధం చేశాయి. ఎల్‌జీ, వోల్టాస్‌ కంపెనీలు ఇప్పటికే సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కల్పించే యూవీ ఎల్‌ఈడీ సిస్టమ్‌తో కూడిన ఏసీలు విడుదల చేశాయి. అలాగే పానాసోనిక్‌ కంపెనీ కరోనా వంటి ప్రమాదకరమైన వైర్‌సల నుంచి 99.99 శాతం రక్షణ కల్పించే నానో ఎక్స్‌ టెక్నాలజీతో కూడిన ఏసీలు విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here