ముంబై: కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతపై ఖర్చు తగ్గినప్పటికీ, దేశీయ ఐటీ రంగ వ్యాపారం మాత్రం ఆరోగ్యకరమైన వృద్ధి కనబర్చనుందని నాస్కామ్ అంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఐటీ రంగ ఆదాయం 2.3 శాతం వృద్ధి చెంది 19,400 కోట్ల డాలర్లకు (రూ.14.16 లక్షల కోట్ల పైమాటే) చేరుకోవచ్చని అంచనా వేసింది. అంతేకాదు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఐటీ ఇండస్ట్రీ మరో 1.38 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని వార్షిక సమీక్ష నివేదికలో వెల్లడించింది. దాంతో ఈ రంగంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 44.7 లక్షలకు చేరుకుందని తెలిపింది. మరిన్ని ముఖ్యాంశాలు..

ఈ ఏడాది మార్చి 31తో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగ ఎగుమతులు 1.9 శాతం వృద్ధి చెంది 15,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు. దేశీయ సేవల ద్వారా ఆదాయం 3.4 శాతం వృద్ధితో 4,500 కోట్ల డాలర్లకు పెరగనుందని అంచనా .
ఈసారి ఐటీ సేవల విభాగం 2.7 శాతం పెరిగి 9,900 కోట్ల డాలర్లకు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) 2.3 శాతం వృద్ధితో 3,800 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విభాగం 2.7 శాతం పెరుగుదలతో 900 కోట్ల డాలర్లు, హార్డ్‌వేర్ విభాగం 4.1 శాతం వృద్ధితో 1,600 కోట్ల డాల్లకు చేరుకోనుంది.
ఈసారి ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆదాయం మాత్రం 0.2 శాతం తగ్గి 3,100 కోట్ల డాలర్లకు పరిమితం కావచ్చు.
ఈ-కామర్స్ విభాగ ఆదాయం 4.8 శాతం పుంజుకొని 5,700 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. ఈ-ట్రావెల్, సంబంధిత సేవలు 75 శాతం క్షీణించినప్పటికీ, ఈ-రిటైల్ సేవలు 82 శాతం పుంజుకోవడం ఇందుకు దోహదపడనుంది.
ఈసారి ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక వ్యయం 3.2 శాతం తగ్గవచ్చు. ప్రపంచ జీడీపీ -3.5 శాతానికి క్షీణించనుండటం ఇందుకు కారణం.
2021లో దూకుడు: ఈ ఏడాది ఐటీ రంగంలో పరిస్థితులపై నాస్కామ్ ఓ సర్వే జరిపింది. 100 ఐటీ కంపెనీల సీఈఓల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ ఏడాది టెక్నాలజీ వ్యయం బాగా పెరగవచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం అభిప్రాయపడ్డారు. 2021లో కొత్త ఉద్యోగుల నియామకాలు సైతం గత ఏడాది కంటే అధిక స్థాయిలో ఉండనున్నాయని 95 శాతం పేర్కొన్నారు.