కార్ల విక్రయాలు పెరిగాయ్‌

0
514
Spread the love

గత ఏడాది ఆగస్టు నుంచి ప్యాసింజరు వాహనాల (పీవీ) విక్రయాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌ వంటి ప్రతికూల పరిణామాలేమీ లేకపోతే.. 2021-22లో ప్యాసింజరు వాహనాల విక్రయాలు 30 లక్షలు, 2030 నాటికి 50 లక్షల స్థాయికి చేరగలవని రెనో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ వేంకట్రామ్‌ మామిళ్లపల్లి తెలిపారు. మొత్తం విక్రయాల్లో 50 శాతం ఎస్‌యూవీలు ఉండనున్నాయి. కొత్త రెనో కైగర్‌ ఎస్‌యూవీ వాహనాల డెలివరీ, విక్రయాలను కంపెనీ ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఈ కార్లను కొనుగోలుదారులకు అందించడానికి ఆయన వచ్చారు.

గ్రామీణ మార్కెట్‌ పెరుగుతోంది: గ్రామీణ, పట్టణ మార్కెట్‌ విస్తరిస్తోంది. జిల్లా స్థాయిల్లో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో మొదటి సారి కారు కొనుగోలు చేసే వారు బాగా పెరిగారు. రెండో సారి, మూడో సారి, నాలుగో సారి కార్లు కొనుగోలు చేసే వారు బాగా తగ్గిపోయారని వేంకట్రామ్‌ అన్నారు. దీనికి తోడు పరిశ్రమ, మౌలిక సదుపాయాలు విస్తరించడం కూడా ప్యాసింజరు వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణమని తెలిపారు. పదేళ్ల క్రితం ద్విచక్ర వాహన మార్కెట్‌ ఏవిధంగా అభివృద్ధి చెందిందో అదే ధోరణి ఇప్పుడు కార్ల పరిశ్రమలో కనిపిస్తోందని చెప్పారు. మొదటి సారి కార్లు కొనే వారు పెరుగుతున్నందున కారు మెయింట్‌నెన్స్‌ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

మైక్రో చిప్స్‌కు కొరత: మైక్రో చిప్స్‌కు కొరత ఏర్పడుతోందని.. దీని వల్ల కార్ల తయారీ ప్రపంచ వ్యాప్తంగా తగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు మొదలైన వాటికి మైక్రో చిప్స్‌ వినియోగిస్తున్నందున కార్ల పరిశ్రమకు కొరత ఏర్పడిందన్నారు.

ఈవీ కార్లకు నాలుగేళ్లు ఆగాలి: దేశంలో చార్జింగ్‌ సదుపాయాలు అభివృద్ధి చెందనందున ఎలక్ట్రిక్‌ కార్లను (ఈవీ) తీసుకురావడం కష్టమని.. సరైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావడానికి 4-5 ఏళ్లు పడుతుందని చెప్పారు. గత ఏడాది ఆటో షోలో క్విడ్‌ ఎలక్ట్రిక్‌ కారును రెనో ప్రదర్శించింది. భారత్‌లో వచ్చే నాలుగైదేళ్ల వరకూ ఎలక్ట్రిక్‌ కారును తీసుకువచ్చే పరిస్థితులు లేవన్నారు.

లక్ష్యం చేరతాం..: భారత మార్కెట్‌లోకి 2018లో ప్రవేశించాం. అప్పట్లో ఏడాదికి 70 వేల కార్లను విక్రయించాం. 2022 నాటికి అమ్మకాలను రెట్టింపు చేయాలని, 4ు మార్కెట్‌ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కైగర్‌తో విక్రయాలు ఏడాదికి 1,30,000 వాహనాలకు చేరే అవకాశం ఉంది. రెనో మొత్తం విక్రయాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంత విక్రయాలు 37 శాతం ఉన్నాయి. ప్రస్తుతం 500 డీలర్‌, సేల్స్‌ కేంద్రాలు ఉన్నాయి. రెండు నెలల్లో వీటిని 700కి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో 32 మంది డీలర్లు ఉన్నట్లు వేంకట్రామ్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా 1100 కైగర్లను బుధవారం కంపెనీ పంపిణీ చేస్తోందని, హైదరాబాద్‌లో 50 కైగర్లను విక్రయించామని చెప్పారు. మరో రెండు వాహనాలపై కంపెనీ కసరత్తు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here