తిరుపతిలో అమర రాజా లిథియం అయాన్‌ బ్యాటరీ యూనిట్‌

0
273
Spread the love

ముంబై : ఆటోమోటివ్‌ బ్యాటరీ తయారీదారు అమర రాజా బ్యాటరీస్‌.. కీలకమైన లిథియం అయాన్‌ బ్యాటరీలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తిరుపతిలోని తన ఉత్పత్తి కేంద్రంలోనే ప్రత్యేక టెక్నాలజీ రీసెర్చ్‌ హబ్‌తో పాటు ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. లిథియం అయాన్‌ బ్యాటరీ కోసం దేశంలో ఒక ప్రైవేటు కంపెనీ ఇలాంటి యూనిట్‌ను ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారని అమర రాజా బ్యాటరీస్‌ సీఈఓ విజయానంద్‌ వెల్లడించారు. కాగా ఈ బ్యాటరీల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అందిస్తోంది. టెక్నాలజీ బదిలీ, బిడ్డింగ్‌ కోసం అమర రాజా 2019లోనే ఇస్రోకు కొంత మొత్తాన్ని చెల్లించింది. మరోవైపు లిథియం అయాన్‌ బ్యాటరీల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే రూ.20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు విజయానంద్‌ తెలిపారు.

రెండేళ్లలో ఉత్పత్తి షురూ

అమర రాజా ఉత్పత్తి చేయబోయే లిథియం అయాన్‌ బ్యాటరీల విడి భాగాల్లో మూడింట రెండొంతులు దేశీయంగానే లభిస్తాయని విజయానంద్‌ చెప్పారు. ప్రధాన ముడి పదార్ధమైన లిథియంను మాత్రం ఆస్ట్రేలియా లేదా కొన్ని లాటిన్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. రానున్న కొద్ది సంవత్సరాల్లోనే తమ లిథి యం అయాన్‌ బ్యాటరీల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారులు లిథియం బ్యాటరీలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని, ఇది ఆ కంపెనీలకు భారంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే వ్యయం తగ్గుతుందన్నారు. 2025 నాటికల్లా దేశంలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వినియోగం 20-25 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు విజయానంద్‌ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here