హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దొడ్ల డెయిరీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ముసాయిదా పత్రాన్ని (డీఆర్‌హెచ్‌పీ)ని మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి సమర్పించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా తాజా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించనున్నారు. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.50 కోట్ల వరకూ సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఓఎఫ్‌ఎస్ ద్వారా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు కోటి షేర్ల వరకూ విక్రయించే వీలుంది. ఇందులో టీపీజీ దొడ్ల హోల్డింగ్స్ పీటీఈ 83 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో పేర్కొన్నారు. దొడ్ల సునీల్ రెడ్డి 4.16 లక్షల షేర్లు, దొడ్ల కుటుంబ ట్రస్ట్ 10.41 లక్షల షేర్లు, దొడ్ల దీపా రెడ్డి 3.27 లక్షల షేర్ల వరకూ విక్రయించనున్నారు. ఇష్యూ మొత్తం పరిమాణం దాదాపు రూ.800 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా.

2018లో కూడా ఐపీఓ ద్వారా దాదాపు రూ.500 కోట్లను సమీకరించడానికి దొడ్ల డెయిరీ పత్రాలు సమర్పించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా నికరంగా లభించిన నిధులను రుణాలు తీర్చడానికి, మూలధన అవసరాలు, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. ఇష్యూకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ బుక్‌రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. 2020 సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలలకు దొడ్ల డైయురీ రూ.75 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. పాల సేకరణ పరంగా దక్షిణాదిలో మూడో అతిపెద్ద డెయిరీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది