గత ఆర్థిక సంవత్సరం (2019-20) దాతృత్వ కార్యక్రమాల కోసం ప్రైవేట్ విరాళాలు వార్షిక ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.64,000 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కాలానికి సంపన్న కుటుంబాల దాతృత్వం మూడింతలై రూ.12,000 కోట్లకు పెరగడం ఇందుకు దోహదపడింది. బైన్ అండ్ కంపెనీ, దాస్రా సంయుక్తంగా రూపొందించిన ‘భారత దాతృత్వ నివేదిక 2021’ ఈ విషయాన్ని వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్ వర్గాలు, విదేశీయుల సాయంతోపాటు సంపన్న వ్యక్తులు లేదా కుటుంబాల దాతృత్వ నిధులను ప్రైవేట్ విరాళాలుగా పరిగణిస్తారు. ఈ నివేదికలో మరిన్ని విషయాలు..
- గత ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ విరాళాల్లో ధనిక కుటుంబాలు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగాల్లో మాత్రమే వృద్ధి నమోదైంది. మిగతా విభాగాల విరాళాలు అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంటే తగ్గాయి. మొత్తం ప్రైవేట్ విరాళాల్లో విదేశాల నుంచి సమకూరిన వాటా 31 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) కార్యక్రమాల కోసం దేశీయ కంపెనీలు ప్రకటించిన నిధుల వాటా కూడా 29 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.
- కరోనా సంక్షోభ ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ సీఎ్‌సఆర్ ఫండింగ్ మరింత తగ్గవచ్చు.
- 2014 నుంచి 2019 మధ్యకాలంలో ప్రైవేట్ దాతృత్వ విరాళాలు 17 శాతం పెరిగాయి. కరోనా ప్రభావంతో 2021లో మాత్రం 5 శాతం మేర తగ్గే అవకాశం ఉంది.
- గత ఆర్థిక సంవత్సరం సంపన్న కుటుంబాలు అత్యధిక శాతం (47 శాతం) విద్యారంగానికే నిధులు ప్రకటించాయి. హెల్త్‌కేర్ (27 శాతం) ఆ తర్వాత స్థానంలో ఉంది.

దేశంలో సంపన్న కుటుంబాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాంతో ఈ కుటుంబాలు దాతృత్వ కార్యక్రమాల కోసం ఇచ్చే నిధులు కూడా పెరిగే అవకాశం ఉంది. ధనిక కుటుంబాలు తమ సంపదలో 2-3 శాతం దాతృత్వం కోసం కేటాయించగలిగితే ఏటా రూ.60,000-1,00,000 కోట్ల అదనపు విరాళాలు లభించే అవకాశం ఉంటుంది.