అంతర్జాతీయంగా ఇంధన డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో ముడిచమురు ధర ఏడాది గరిష్ఠ స్థాయి 60 డాలర్లు దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ రేటు బుధవారం నాడు 61.46 డాలర్లు పలికింది. గత ఏడాది అక్టోబరులో 40 డాలర్ల స్థాయిలో ట్రేడైన ధర.. గడిచిన మూడు నెలలకు పైగా కాలంలో 50 శాతం పుంజుకుంది. సమీప భవిష్యత్‌లో మరో 5-10 డాలర్ల మేర పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో బ్రెంట్ క్రూడ్ 100 డాలర్లకు ఎగబాకవచ్చని ఎనర్జీ యాస్పెక్ట్స్‌కు చెందిన చీఫ్ ఆయిల్ అనలిస్ట్ అమృతాసేన్ అంటున్నారు. ’’క్రమంగా పెరుగుతూపోతున్న ముడి చమురు ధరలు వచ్చే ఏడాదిలో 80 డాలర్లకు చేరుకోవచ్చని ముందు నుంచే అంచనా వేస్తూ వచ్చాం. అయితే, అగ్రరాజ్యాలు అనుసరిస్తున్న అత్యంత సులభతర ద్రవ్య విధానం, వాణిజ్యానికి ఊతమిచ్చేందుకు ప్రకటిస్తున్న భారీ ఉద్దీపనల ప్రభావంతో 100 డాలర్లకు పెరిగినా ఆశ్చర్యపోనకర్లేద’’ని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంధన గిరాకీ బలహీనంగానే ఉన్నప్పటికీ, ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం బాగా పుంజుకోవచ్చన్నారు.

క్రూడ్ ధరల పెరుగుదలకు కారణాలు
కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం మొదలవడంతో చాలా దేశాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుండటం. మార్కెట్ డిమాండ్ పునరుద్ధరణ.
పెట్రోలియం ఎగుమతి దేశాల్లో(ఒపెక్)ని కీలక సభ్యులు ఉత్పత్తి తగ్గించుకోవడంతోపాటు అమెరికా ప్రభుత్వం డిమాండ్ పెంచేందుకు సరికొత్త ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న అంచనాలు.
ప్రపంచంలో అతిపెద్ద ఇంధన దిగుమతిదారైన చైనాకు సరఫరా ఆరు నెలల గరిష్ఠానికి పెరగడం.
లీటరు పెట్రోల్ త్వరలో రూ.100!
మన దేశంలో ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు సెగలు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రల్ బుధవారం నాడు మరో 30 పైసలు పెరిగి రూ.91.09కి చేరుకోగా.. డీజిల్ రేటు రూ.84.79కి ఎగబాకింది. ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై గత ఏడాది పెంచిన సుంకాలను మళ్లీ తగ్గించుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ, అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ కొనసాగితే, లీటరు పెట్రోల్ త్వరలోనే రూ.100కు చేరుకునే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా.