విక్రేతల పట్ల పక్షపాతం తగదు..

0
191
Spread the love

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జియోమార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ కంపెనీలు.. తమ విక్రేతల పట్ల ఎలాంటి పక్షపాతం చూపరాదని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈ-కామర్స్‌ ముసాయిదా పాలసీ పేర్కొంది. అలాగే, ఈ-కామర్స్‌ కంపెనీలు డిస్కౌంట్లపై స్పష్టమైన, పారదర్శకమైన విధానాలను అవలంబించాలని అంటోంది. దేశంలో బడా ఈ-కామర్స్‌ కంపెనీలు అవలంబిస్తున్న గుత్తాధిపత్య విధానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లౌడ్‌టెల్‌ వంటి కొన్ని బడా విక్రయ కంపెనీలకే పెద్దపీట వేయడం ద్వారా తమ అవకాశాలకు గండికొడుతున్నారని చిన్న విక్రేతలు వాపోతున్నారు. భారీ డిస్కౌంట్ల ద్వారా ఈ కంపెనీలు మార్కెట్‌ పోటీ నిబంధనలను అతిక్రమిస్తున్నాయంటూ ఆఫ్‌లైన్‌ వర్తకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఈ-కామర్స్‌ పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుపుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) ఈ ముసాయిదా పాలసీని రూపొందించింది. దీనిపై గడిచిన కొన్ని నెలలుగా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. డీపీఐఐటీ చీఫ్‌ అధ్యక్షతన అంతరమంత్రిత్వ శాఖల బృందం శనివారం(ఈనెల 13) సమావేశమై ఈ పాలసీపై చర్చించింది.

డేటా రక్షణకు తగిన చర్యలు: ఏదేని పరిశ్రమ అభివృద్ధి కోసం డేటా వినియోగానికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలను రూపొందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా దుర్వినియోగం కాకుండా, అనధికార వ్యక్తులు డేటా యాక్సెస్‌ చేయకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు ఈ-కామర్స్‌ ముసాయిదా పాలసీలో పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం వ్యక్తిగత, వ్యక్తిగతేతర డేటాకు నిబంధనలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here