న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగుల వేతన పెంపు సగటు 6.4 శాతంగా ఉండవచ్చని విల్లీస్ టవర్స్ వాట్సన్ సర్వే నివేదిక అంటోంది. గత ఏడాదిలో నమోదైన 5.9 శాతం సగటుతో పోలిస్తే కాస్త మెరుగుపడనుందని పేర్కొంది. కరోనా సంక్షోభ ప్రభావిత కార్పొరేట్ రంగంలో వ్యాపార పునరుద్ధరణపై ఆశావా దం మరింత పెరిగినప్పటికీ, వేతన పెంపు బడ్జెట్ లో మాత్రం అది ప్రతిబింబించడం లేదని విల్లీస్ టవర్స్ వాట్సన్ ఇండియా టాలెంట్ అండ్ రివార్డ్ విభాగ అధిపతి రాజుల్ మాథుర్ అన్నారు. వేతన పెంపు బడ్జెట్ కేటాయింపుల్లో కీలక ఉద్యోగులు, అత్యంత ప్రతిభ కనబరుస్తున్న నిపుణులు వలస వెళ్లకుండా కాపాడుకునేందుకే కంపెనీలు పెద్దపీట వేయవచ్చన్నారు.

ప్రతిభావంతులకు ఈ ఏడాది సగటున 20.6 శాతం వేతన పెంపు ఉండవచ్చని రిపోర్టు అంచనా వేసింది. గత ఏడాది అక్టోబరు/నవంబరులో ఆన్‌లైన్ ద్వారా 130 దేశాలకు చెందిన 18,000 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది. భారత్‌లో సర్వే చేసిన కంపెనీల్లో 37 శాతం.. వచ్చే ఏడాదికాలంలో ఆదాయంపై సానుకూలంగా ఉన్నాయి. అయితే, ఉద్యోగ నియామకాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది.