వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో ప్రకటించారు. ఈ ప్రక్రియకు మార్గం సుగమం చేసేందుకు ప్రభుత్వం పలు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రైవేటీకరించనున్న రెండు బ్యాంకుల సిబ్బందిని ఇతర పీఎ్‌సబీలకు, మొండి బకాయిల (ఎన్‌పీఏ)ను ప్రతిపాదిత బ్యాడ్‌బ్యాంక్‌కు బదలాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రైవేటీకరణ ప్రక్రియలో పీఎ్‌సబీ ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలగకుండా చూస్తామని సీతారామన్ ఈ మధ్యనే సంకేతాలిచ్చారు. అలాగే, ఎన్‌పీఏల భారాన్ని తుడిచేయడం ద్వారా బ్యాంకుల విలువను పెంచడంతో పాటు ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడత ప్రైవేటీకరణకు పీఎస్‌బీలను ఎంపిక చేసేందుకు ఆర్థిక శాఖ వచ్చే వారంలో నీతిఆయోగ్‌తో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

ఆ నాలుగు మినహా..
మెగా విలీనాల తర్వాత పీఎస్‌బీల సంఖ్య 12కు తగ్గింది. ఇప్పటివరకు జరిగిన విలీనాల్లో భాగం కాని బ్యాంకులను మాత్రమే ప్రైవేటీకరణకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మోదీ సర్కారు ఇందుకోసం 4 మధ్య స్థాయి పీఎ్‌సబీలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) ఉన్నాయి. ఇందులో రెండింటిని తొలుత ప్రైవేటీకరించే అవకాశం ఉంది. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), కెనరా బ్యాంక్ మినహా అన్ని పీఎ్‌సబీలను విడతల వారీగా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.