అరుదైన ఘనత సాధించిన బంబుల్ సీఈఓ విట్నీ వోల్ఫ్ హెర్డ్

అమెరికన్ ఆన్‌లైన్ డేటింగ్ యాప్ బంబుల్ వ్యవస్థాపకురాలు, సీఈఓ విట్నీ వోల్ఫ్ హెర్డ్ 31 ఏళ్లకే బిలియనీర్‌గా అవతరించింది. స్వశక్తితో బిలియనీర్‌గా ఎదిగిన మహిళల్లో అత్యంత పిన్న వయస్కురాలుగా ఘనత సాధించింది. అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలి రోజునే బంబుల్ షేరు ధర 67 శాతం పెరిగి 72 డాలర్లకు చేరుకుంది.
దాంతో, కంపెనీలోని సీఈఓ ఈక్విటీ వాటా విలువ 1.5 బిలియన్ (150 కోట్లు) డాలర్లకు పెరిగింది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం.. మన కరెన్సీలో రూ.10,950 కోట్లకు సమానం. టిండర్ డేటింగ్ యాప్‌లో ఉన్నత హోదాలో పనిచేసి వైదొలిగిన హెర్డ్.. 2014లో బంబుల్‌ను ప్రారంభించింది. 4.2 కోట్ల మంది యూజర్లు కలిగిన ఈ యాప్.. గత నెల 15న తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు వచ్చింది.