బీజేపీ నాయకులు వాపును చూసుకొని బలుపు అనుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సోమవారం కూకట్‌పల్లిలోని నైనా గార్డెన్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని, ఐటీఐఆర్ రద్దు చేయడంతోపాటు గతంలో ఇచ్చిన హామీలనూ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచమంతా పెట్రో ధరలు తగ్గుతుంటే.. మన దేశంలో మాత్రం కేంద్రం ప్రభుత్వం భారీగా పెంచి ప్రజలపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజలు పొందే ఉద్యోగ రిజర్వేషన్లను కోల్పోయేలా చేస్తోందని ఆరోపించారు. మాజీ ప్రధాని కుమార్తెగా బరిలోకి దిగిన విద్యావేత్త సురభి వాణీదేవి గెలుపు ఖాయమని, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆమెను ప్రకటించిన రోజు నుంచే బీజేపీ, కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. ఇప్పటికే 1.34 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించామని, మరో 50వేల ఉద్యోగాలు కల్పించేందు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.