బెజవాడలో బెట్టింగ్‌ జోరు!

0
183
Spread the love

విజయవాడ నగర పాలక సంస్థలో మొత్తం 64 డివిజన్లకు బుధవారం పోలింగ్‌ ముగిసింది. మరో రెండ్రోజుల్లో అభ్యర్థుల జాతకాలు బయటకు రానున్నాయి. ఈలోపు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఉత్కంఠను ఆపుకోలేకపోతున్నారు. పందేలకు కాలు దువ్వుతున్నారు. మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుంది.. డివిజన్లలో ఎవరికి.. ఎంతెంత మెజారిటీ వస్తుంది.. ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కుతాయి.. ఎలా కేటగిరీల వారీగా నాయకులు, కార్యకర్తలు బెట్టింగ్‌లు కడుతున్నారు. కొన్ని డివిజన్లలో బెట్టింగ్‌ రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెళ్లింది. పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్‌ నుంచి టీడీపీ తరపున మహ్మద్‌ విజయలక్ష్మి, వైసీపీ నుంచి బండి పుణ్యశీల పోటీపడ్డారు. ఇక్కడ పుణ్యశీల సిటింగ్‌ కార్పొరేటర్‌. పైగా వైసీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. ఈ డివిజన్‌లో గెలుపుపై టీడీపీ, వైసీపీ నేతలు రూ.10 లక్షలు పందెం కట్టారు. మేయర్‌ పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 33.. వైసీపీ నేతలు తమకు ఈ సంఖ్య దాటి డివిజన్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ నేతలూ అదే స్థాయిలో అంచనాలు వేస్తున్నారు. సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందని.. మొత్తంగా 40 డివిజన్లు దక్కుతాయని అంటున్నారు. ఎంతలేదన్నా.. 36 స్థానాలు కచ్చితంగా తమ ఖాతాలో పడతాయన్నది వారి లెక్క. ఒకవేళ 30 డివిజన్లు వచ్చినా మేయర్‌ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులు టీడీపీకి అధికంగా ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది.

శ్వేత విజయంపై పది లక్షలు..

టీడీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పేరును ప్రకటించారు. ఈమె తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్‌ నుంచి పోటీ చేశారు. ఈమె గెలుపుపై వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రూ.10 లక్షల వరకు పందెం కట్టారు. వ్యాపార వర్గాలూ ఈసారి భారీగా బెట్టింగ్‌లకు దిగాయి. విజయవాడ మేయర్‌ పీఠంపై టీడీపీ అభ్యర్థి కూర్చుంటారని రూ.10 లక్షలకు పందెం కడితే, అది తమకే దక్కుతుందదని వైసీపీ నేతలు రూ.30 లక్షలు బెట్టింగ్‌ కాశారు. 2014 ఎన్నికల్లో నగరంలో సెంట్రల్‌ నియోజకవర్గంలో 17 మంది టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సంఖ్య ఈసారి 19 వరకు వెళ్తుందని టీడీపీ నేతలు పందెం వేశారు. కాదు.. 17 డివిజన్లలో తామే గెలుస్తామని వైసీపీ నేతలు నగదు కట్టలను సిద్ధం చేసుకున్నారు. సుమారుగా రూ.25 లక్షల వరకు పందెం కట్టినట్లు సమాచారం.

మున్సి‘పోల్స్‌’లో ఓటింగ్‌ 64.34 శాతం: ఎస్‌ఈసీ

అమరావతి, మార్చి 11రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో సగటున 64.34 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నిర్ధారించింది. బుధవారం ఈ సగటును 62.28 శాతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలకు సదరు కార్పొరేషన్లు ఉన్న జిల్లాల కలెక్టర్లు ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. 1 కంటే ఎక్కువ కార్పొరేషన్లను కలిగిన జిల్లాల్లో (చిత్తూరు, కృష్ణాల్లో 2 చొప్పున ఉన్నాయి) మాత్రం వాటిల్లో ఒకదాని ప్రత్యేక సమావేశానికి సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఉంటారని కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకోవైపు బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూములు, లెక్కింపు కేంద్రాల వివరాలను ఎస్‌ఈసీ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here