ఈసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షి్‌పలో భారత్ నుంచి 19 మంది షట్లర్లు పోటీపడుతున్నారు. వీరందరిలోకి ప్రధాన పోటీదారు సింధుపైనే అందరి దృష్టి నెలకొంది. కొవిడ్ తర్వాత మొదలైన టోర్నీల్లో పూర్తిగా నిరాశపరచిందన్న విమర్శలు ఎదుర్కొన్న సింధు.. ఇటీవల స్విస్ ఓపెన్‌లో ఫైనల్ దాకా చేరి మళ్లీ ఫామ్‌లోకొచ్చింది. దీనికి తోడు స్విస్ ఓపెన్‌లో తనను ఓడించిన స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ గాయంతో దూరమవడం.. ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్ కాదన్న కారణంగా డిఫెండింగ్ చాంప్ తై జు యింగ్‌తో పాటు కొరియా, చైనా షట్లర్లు కూడా తప్పుకోవడంతో ఈసారి సింధుకు టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ టోర్నీలో సింధు అత్యుత్తమ ప్రదర్శన 2018లో సెమీస్ చేరడం. సోనియా చేతో తొలిరౌండ్ ఆడనున్న ఐదోసీడ్ సింధు ఆరంభ రౌండ్లను అధిగమిస్తే క్వార్టర్స్‌లో మూడోసీడ్ యమగూచిని ఢీకొనాల్సి రావచ్చు. ఇక.. 2015 రన్నరప్ సైనా ఆరంభ రౌండ్లో ఏడోసీడ్ మియా బ్లిచెఫెల్ట్‌తో తలపడనుంది. ప్రస్తుతం ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న సైనా.. ప్రత్యర్థులకు ఏమాత్రం పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పురుషుల్లో సింగిల్స్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టిపై అంచనాలున్నాయి. ఆరంభరౌండ్లలో సుగియార్తోతో శ్రీకాంత్, టోమా జూనియర్‌తో సాయి ప్రణీత్, టాప్‌సీడ్ మొమోటాతో కశ్యప్, డారెన్ లీతో ప్రణయ్, ఇగోర్ కోల్చెతో సమీర్ వర్మ, కాంటాఫాన్‌తో యువ కెరటం లక్ష్యసేన్ తలపడనున్నారు. ఇటీవల స్విస్ ఓపెన్‌లో సెమీస్ చేరి ఆకట్టుకున్న సాత్విక్-చిరాగ్ జంట ఆరంభ రౌండ్లో ఫ్రాన్స్ ద్వయం ఆడమ్-జులియన్‌తో ఆడనుంది. మిక్స్‌డ్‌లో జపాన్ జోడీ యుకీ-మిసాకితో సాత్విక్-అశ్విన్ జంట, ఇంగ్లండ్ ద్వయం మాక్స్-జెస్సికాతో సిక్కిరెడ్డి-ప్రణవ్ జోడీ, మహిళల డబుల్స్‌లో థాయ్ జంట బెనియాపా-నున్‌తాకర్‌తో సిక్కి-అశ్విని ద్వయం తొలిరౌండ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
