భారత్‌ను ఆపతరమా?

0
288
Spread the love

కొత్త కుర్రాళ్ల జోరుకు సీనియర్ల సత్తా తోడవడంతో మొదటి వన్డేలో భారత్‌కు తిరుగులేకుండా పోయింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఓ దశలో వణికించినా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తొలుత బ్యాట్స్‌మెన్‌ మెరవడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. మొత్తంగా బ్యాట్స్‌మెన్‌, బౌలర్ల సమష్టితత్వానికి మొదటి వన్డే అద్దం పట్టింది. మంగళవారంనాటి మ్యాచ్‌తో 50 ఓవర్లలో అరంగేట్రం చేసిన క్రునాల్‌ ఏస్థాయిలో అదరగొట్టాడో చూశాం. అలాగే మరో అరంగేట్ర యువ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌ అమోఘం. ఫామ్‌ కోల్పోయి జట్టులో చోటే ప్రమాదంలో పడిన ఓపెనర్‌ ధవన్‌ తొలి వన్డేలో బ్యాట్‌ ఝళిపించడం టీమిండియాకు శుభసూచకం. అతడు అదే స్థాయిలో ఆడితే భారత్‌ మరోసారి భారీ స్కోరు చేయడం ఖాయం. ముంజేతికి గాయమైనా ఓపెనర్‌ రోహిత్‌ ఫిట్‌గానే ఉన్నాడు. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే ధవన్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. రాహుల్‌ ఎప్పటిలాగే మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ గాయపడడంతో అతడి స్థానంలో పంత్‌ బరిలోకి దిగనున్నాడు. అతడిని బ్యాట్స్‌మన్‌గానే పరిమితం చేస్తారని సమాచారం. అంటే.. రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మొదటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చిన చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ స్థానంలో చాహల్‌ జట్టులోకి రానున్నాడు. ఇక భువనేశ్వర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌ పేస్‌ త్రయం తిరిగి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పనిపట్టేందుకు సిద్ధంగా ఉంది.

సిరీస్‌కు మోర్గాన్‌ దూరం

కనీసం వన్డే సిరీ్‌సలోనైనా అవకాశాలు సజీవంగా ఉండాలంటే రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తప్పక నెగ్గాల్సి ఉంటుంది. కానీ ఆ జట్టును గాయాలు పీడిస్తున్నాయి. మొదటి వన్డేలో ఫీల్డింగ్‌ సందర్భంగా చేతికి గాయమైన మోర్గాన్‌..మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో బట్లర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే శామ్‌ బిల్లింగ్స్‌ కూడా గాయంతో రెండో మ్యాచ్‌నుంచి వైదొలిగాడు. బిల్లింగ్స్‌ స్థానంలో లివింగ్‌ స్టోన్‌ వన్డే అరంగేట్రం చేయనున్నాడు. తొలి వన్డేలో మెరుపులు మెరిపించిన ఓపెనర్లు బెయిర్‌స్టో, జాసన్‌ రాయ్‌ అదే దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు. స్టోక్స్‌, బట్లర్‌, మొయిన్‌ అలీతో కూడిన మిడిలార్డర్‌ విఫలమవుతుండడం పర్యాటక జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. కీలక స్పిన్నర్లు అదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీ భారత బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బందిపెట్టలేకపోవడం ఇంగ్లండ్‌ను కలవర పరుస్తోంది.

జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, కేఎల్‌ రాహుల్‌ (కీపర్‌), పంత్‌, హార్దిక్‌, క్రునాల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, చాహల్‌

ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌, కీపర్‌), రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, లివింగ్‌ స్టోన్‌, మొయిన్‌ అలీ, శామ్‌ కర్రాన్‌, టామ్‌ కర్రాన్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ ఉడ్‌/రీస్‌ టోప్లే, డేవిడ్‌ మలాన్‌.

పిచ్‌

ఆరంభంలో ఇబ్బందిపెట్టినా ఆపై ఫ్లాట్‌గా మారి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుంది. అందుకే టాస్‌ గెలిచే జట్టు చేజింగ్‌కు ప్రాధాన్యమిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here