భూఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యస్థాయి క్షిపణి(ఎంఆర్‌శామ్) కిట్ల తొలి బ్యాచ్‌ను కల్యాణి రఫెల్ అడ్వాన్స్ సిస్టమ్స్ (క్రాస్) సంస్థ మంగళవారం అందజేసింది. భారత సైన్యానికి, వైమానిక దళానికి వెయ్యి మిస్సైల్ కిట్లు అందించే లక్ష్యంలో తొలిదశను తాము పూర్తిచేశామని కల్యాణి గ్రూప్ సీఈవో రాజేందర్ భాటియా తెలిపారు. ‘‘భారత సైన్యంతో పాటు వైమానిక దళానికి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కిట్లు అందజేయడం ద్వారా.. కల్యాణి గ్రూప్, ఇజ్రాయిల్‌కు చెందిన రఫెల్ అడ్వాన్డ్స్ డిఫెన్స్ సిస్టం ఖ్యాతిగాంచాయి’’ అని ఇజ్రాయిల్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పిన్‌హ్‌స యంగ్‌మన్, కల్యాణి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ బాబాకల్యాణ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హార్డ్‌వేర్ పార్కులోని ‘కల్యాణి రఫెల్ అడ్వాన్డ్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో మంగళవానం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా నిర్దేశించిన మైలురాయిని కల్యాణి గ్రూప్ చేరుకుందని తెలిపారు.

అత్యుత్తమ శ్రేణి మిస్సైల్ కిట్లతోపాటు ఇన్‌సర్వీ్‌స ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థకు సాంకేతిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. భారత సైనిక అవసరాల కోసం రఫెల్ సాంకేతికతను కల్యాణి గ్రూప్ ఇంజినీరింగ్ విభాగం వినియోగించుకుంటోందన్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా తమ సంస్థ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా భారత సైన్యానికి నమ్మకంగా సేవలందిస్తున్నామన్నారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ప్రతీకగా ఈ మిస్సైల్ కిట్లు నిలుస్తాయని రాజేందర్ తెలిపారు.