హిందూవాహిని కార్యకర్తల వల్లే నిర్మల్ జిల్లా భైంసాలో గత ఆదివారం ఘర్షణలు జరిగాయని ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. అల్లర్లకు కారకులైన వారిపై పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం భైంసాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘర్షణలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఐజీ నాగిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. భైంసాలో హిందూవాహిని కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని, పోలీసులు కేసు దర్యాప్తును పారదర్శకంగా జరపడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 7న రాత్రి 8.20 గంటల సమయంలో ఘర్షణ జరిగిందని చెప్పారు. తోట మహేశ్, దత్తు పటేల్ అనే ఇద్దరు బైక్‌పై వెళుతూ.. తన ఇద్దరు స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తున్న రిజ్వాన్ తలపై వెనుకనుంచి కొట్టారని పేర్కొన్నారు. ఘర్షణకు ఇదే ప్రధాన కారణమని తెలిపారు.

కొంతసేపటికి రిజ్వాన్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి బట్టీ గల్లీకి వచ్చి మహేశ్ కోసం వెతికే క్రమంలో దత్తు, రాకేశ్, గోకుల్, మహేశ్‌లు వారిపై దాడి చేశారని వెల్లడించారు. దాడికి పాల్పడ్డ నలుగురూ హిందూవాహినికి చెందినవారేనని తెలిపారు. కొద్దిసేపటి తర్వాత దత్తు, మహేశ్‌లు మద్యం కొనుగోలు చేసేందుకు బైక్‌పై జుల్ఫికర్ మసీదు నుంచి వెళ్లే సమయంలో అక్కడ ఘర్షణ మొదలై, పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారని వివరించారు. పికెటింగ్‌లో ఉన్న స్పెషల్ పార్టీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్‌కు గాయమైందన్నారు. కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో డీఎస్పీ, అదనపు బలగాలు అక్కడికి చేరుకుని గంటన్నరలోనే పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. భైంసా ఘటనలో ఒక గ్రూప్‌కి చెందిన హకీం హబీబ్ 15వ వార్డు కౌన్సిలర్ అని, మరో గ్రూప్‌కి చెందిన తోట విజయ్ 18వ వార్డు కౌన్సిలర్‌గా ఉండటంతోపాటు హిందూవాహినికి చెందినవారని నాగిరెడ్డి వివరించారు. 7న రాత్రి జరిగిన దాడుల తర్వాత 8,9,10 తేదీల్లో పరిసర ప్రాంతాల్లో దాడులు జరిగాయని, వీటికి సంతోశ్, క్రాంతి, బాలాజీ, జగదీశ్ కారణమని ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు.
70 మంది ప్రమేయంపై ఆరా
సీసీ టీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలు, సాక్షులను విచారించిన తర్వాత 26 కేసులు నమోదు చేసి 38 మందిని అరెస్ట్ చేశామని, మరో నలుగురు మైనర్లు కూడా ఉన్నారని ఐజీ వివరించారు. ఇంకో 70 మందిని గుర్తించామని వారి ప్రమేయంపై ఆధారాలు సేకరించాక అరెస్టులు ఉంటాయని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఏ పార్టీ, నాయకుల ప్రమేయం ఉన్నా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పోలీసులు ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మరోసారి స్పష్టం చేశారు.
అత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్నాం
భైంసాలో చిన్నారిపై అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని నాగిరెడ్డి తెలిపారు. బాధిత బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లినపుడు చికిత్స చేసి పంపించారని, ఆస్పత్రి వారు పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఫలితంగా ఆలస్యం జరిగిందని చెప్పారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించామని, దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు.