నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్ల నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఆదివారం 4 గంటల పాటు సడలించారు. 144 సెక్షన్ విధింపు కారణంగా ఆరురోజులుగా ఇళ్లకే పరిమితమైన జనం ఎలాంటి కొనుగోళ్లు చేపట్టలేకపోయారు. నిత్యావసరాలు నిండుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు 144 సెక్షన్‌ను అధికారులు సడలించారు. దీంతో రోడ్లపైకి వచ్చిన జనం నిత్యావసర సరుకుల కోసం ఎగబడ్డారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు సడలింపు కొనసాగుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా, అల్లర్ల నేపథ్యంలో మూడో రోజూ ఆదివారం నిర్మల్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో జేఈఈ రాసే విద్యార్థులు ప్రిపరేషన్ కోసం నిర్మల్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్న వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల ను సమీప జిల్లాలకు తీసుకువెళ్లక తప్పలేదు. సమయానికి ఏటీఎంలు కూడా పని చేయకపోవడంతో నగదుకు కటకటలాడుతున్నారు.

66 మంది బైండోవర్
నిర్మల్ జిల్లా భైంసాలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో 66 మందిని బైౖండోవర్ చేశామని ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు.ఎస్ వారియర్ తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 28 కేసులు నమోదు చేసి.. 40 మందిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. మరో 29 మంది నిందితులు పరారీ లో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చేపడుతున్నాయని తెలిపారు.