రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన ఇండియా లెజెండ్స్ ఫైనల్లోనూ చెలరేగారు. ఆదివారం జరిగిన అంతిమ సమరంలో శ్రీలంక లెజెండ్స్‌ను 14 పరుగులతో ఓడించి విజేతలుగా నిలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్), యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60) దుమ్మురేపడంతో 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది. సచిన్ (23 బంతుల్లో 5 ఫోర్లతో 30) కూడా సత్తా చాటాడు. రంగన హెరాత్, సనత్ జయసూర్య, మహరూఫ్, వీరరత్నే ఒక్కో వికెట్ పడగొట్టారు. ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 167/7 స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు సనత్ జయసూర్య (35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), తిలకరత్నే దిల్షాన్ (18 బంతుల్లో 3 ఫోర్లతో 21) మెరుపు ఆరంభాన్నిచ్చారు. చివర్లో వీరరత్నే (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. యూసుఫ్ పఠాన్ (2/26), ఇర్ఫాన్ పఠాన్ (2/29) రెండేసి వికెట్లు తీశారు.
