ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మార్చి 10న జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చే ఉద్దేశంతో ఆదివారమిక్కడ ఒక హోటల్‌లో జరిగిన రెడ్డి కుల సంఘం (రెడ్డి సోదరుల ఆత్మీయ కలయిక) సమావేశానికి హాజరు కావడమే కాకుండా వేదికపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కనే ఆశీనుడయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపరమైన సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అయితే ఈ నిబంధనలను వీసీ విస్మరించారు. కుల సంఘం సమావేశానికి హాజరై వేదికపైకి వెళ్లి విజయసాయిరెడ్డి పక్కన కూర్చుని ముచ్చటించారు. సమావేశం వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఒక కుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రసాదరెడ్డి హాజరుకావడంపై సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు టీఎన్‌ఎ్‌సఎఫ్ నాయకుడు ప్రణవ్‌గోపాల్ తెలిపారు. ప్రసాదరావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.